టీం ఇండియా పేసర్  మహ్మద్ షమి.. భార్య హనిస్ జహాన్ చేసిన ఆరోపణలపై స్పందించారు. తన భార్య చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని షమీ తెలిపాడు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పాడు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే తన కెరీర్‌ను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఆట నుంచి దూరం చేయడానికి భారీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించాడు. తన పరువు తీయడానికి ఎవరో కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని షమీ ట్వీట్ చేశాడు.

 

ఇదిలా ఉండగా..తన భర్తకి చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ హనిస్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా షమీ.. కొందరు అమ్మాయిలతో దిగిన ఫోటోలు, ఛాటింగ్ లను ఆమె స్క్రీన్ షాట్ తీసి మరి ఫేస్ బుక్ లో పెట్టింది. ఇప్పుడు ఆ ఫోటోలు విపరీతంగా వైరలయ్యాయి. కాగా షమీ మాత్రం భార్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు.