మొత్తానికి తాను మాట్లాడకుండానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగుస్తుండటం ప్రధాని విజయమే.
నిజానికి ఎన్ డిఏ సిగ్గు పడాల్సిన విషయం. దేశ ప్రధానిగా తాను సృష్టించిన సమస్యపై పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడటానికే వెన్ను చూపిన ప్రధాని బహుశా దేశ చరిత్రలో నరేంద్ర మోడి తప్ప ఇంకోరు ఉండరేమో. నోట్ల రద్దు తర్వాత మొదలైన పార్లమెంట్ సమావేశాల్లో ఒక్కరోజు కూడా ప్రధాని మాట్లాడకుండానే సమావేశాలు ముగిస్తున్నాయి. నవంబర్ 8వ తేదీన ప్రధాని నోట్ల రద్దు ప్రకటించారు. 16వ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆరంభమయ్యాయి. శుక్రవారంతో ఆఖరు.
సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటి వరకూ కనీసం ఒక్కరోజు కూడా మోడి పార్లమెంట్ ఉభయసభల్లో ఎందులోనూ ప్రసంగించలేదు. దేశాన్ని పట్టి కుదిపేస్తున్న నోట్ల రద్దు వ్యవహారంపై ప్రధాని పార్లమెంట్ లో ప్రకటించాలని, నోట్ల రద్దు పై చర్చ జరగాలని విపక్షాలు ఎంత డిమాండ్ చేసినా ప్రధాని ఖాతరు చేయలేదు.
నోట్ల రద్దు తర్వాత దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, విపక్షాలు ఏకమవ్వటం తదితరాలను గమనించిన ప్రధాని పార్లమెంట్ లో మాట్లాడేందుకు సాహసించలేదు. ప్రధాని ప్రసింగిస్తారని కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, అరుణ్ జైట్లీ పలుమార్లు ప్రకటించినా మోడి మాత్రం సభలో మాట్లాడలేదు. దాంతో ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదు.
మొత్తానికి తాను మాట్లాడకుండానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగుస్తుండటం ప్రధాని విజయమే. గతంలో ఏ ప్రధాని కూడా ఈ విధంగా చేయలేదు. తమ పాలనలో ఎన్ని సమస్యలు తలెత్తినా, కుంభకోణాలు జరిగినా నాటి ప్రధానులు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని విపక్షాలను ఎదుర్కొన్నారేగానీ మోడి లాగ మొహం చాటేయలేదు. ఏదో మొక్కుబడిగా ఒకటి, రెండు సార్లు సభకు హాజరైనా మౌనమునిలాగ కూర్చున్నారే తప్ప ఏమీ మాట్లాడలేదు.
ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంట్ మళ్ళీ సమావేశమయ్యేది ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లోనే. అప్పటికి దేశంలోని పరిస్ధితి ఎలాగుంటుందో ఎవరో చెప్పలేరు.
రాజ్యసభలో అంటే ఎన్డిఏ ప్రభుత్వానికి బలం లేదనుకున్నా లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉంది. మరి లోక్ సభలో కూడా మాట్లాడేందుకు మోడి ఎందుకు భయపడ్డారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
