కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఇది రైతు అనుకూల బడ్జెట్ అని ఆయన అన్నారు. బడ్జెట్ అనంతరం మోడీ మీడియాతో మాట్లాడారు. రైతులకు, సాధారణ పౌరులకు, వ్యాపారవేత్తలకు బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. ఈ బడ్జెట్‌తో ప్రజల జీవన విధానం మరింత సరళంగా మారుతుందన్నారు. అన్ని రంగాలపై బడ్జెట్‌ను కేంద్రీకరించారన్నారు.
 

వ్యవసాయం నుంచి మౌళిక సదుపాయాల కల్పన వరకు కేటాయింపులు జరిగాయన్నారు. రైతులు, దళితులు, గిరిజన వర్గాలు ఈ బడ్జెట్ నుంచి లాభం పొందుతారన్నారు. గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ద్వారా కొత్త అవకాశాలు వస్తాయని ప్రధాని  తెలిపారు. అన్ని తరహా పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్థిక మంత్రికి కంగ్రాట్స్ తెలిపారు. కనీస మద్దతు ధర రైతులకు విశేషంగా ఉపయోగపడుతుందని ప్రధాని చెప్పారు.