తాను ఢిల్లీ నుండి ప్రత్యేకంగా జయలలిత కోసమే వచ్చానని చుట్టుపక్కల వాళ్లకు మోడి చెప్పకనే చెప్పినట్లైంది.

మోడి రూటే సపరేటు. సందర్భం ఏదన్నా సరే తన వ్యక్తిత్వాన్ని ప్రమోట్ చేసుకునేందుకే మోడి ప్రాధాన్యత ఇస్తారు. ఆయన దుస్తులు, భాష, హావభావాలన్నీ ఈ లక్ష్యం వైపే ఉంటాయి. తాజాగా అదే విషయం మరోసారి రుజువైంది. జయలలిత పార్దివదేహానికి నివాళులు అర్పించటానికి చెన్నైకు వచ్చారు.

విమానాశ్రయం నుండి నేరుగా రాజాజీ హాలుకు చేరుకున్నారు. మోడి కాసేపట్లో వస్తున్నారన్న విషయం తెలుసు కాబట్టి ప్రముఖులు, ప్రజలు అందరూ ప్రధాని కాన్వాయ్ వచ్చే దిశవైపే చూస్తున్నారు.

ఇంతలో ప్రధాని వాహనం రాజాజీ హాలు వద్దకు చేరుకున్నది. మామూలుగా అయితే, వాహనం దిగగానే ఇంకెవరైనా అయితే, నేరుగా పార్దివదేహం వద్దుకు వెళ్లిపోయేవారు. అయితే, వాహనంలో నుండి దిగింది మోడి కాబట్టి నేరుగా జయ పార్దివదేహం వద్దకు వెళ్లకుండా వాహనం దిగగానే అక్కడే నిలబడ్డారు.

ఒకసారి చుట్టూ చూస్తూ అందరికీ నమస్కారాలు చేసారు. తాను ఢిల్లీ నుండి ప్రత్యేకంగా జయలలిత కోసమే వచ్చానని చుట్టుపక్కల వాళ్లకు మోడి చెప్పకనే చెప్పినట్లైంది.

నమస్కారాలు చేస్తూనే నేరుగా జయ మృతదేహం వద్దకు చేరుకున్నారు. మెట్లెక్కేటప్పుడు కూడా చుట్టుపక్కల చూసుకుంటూ సమస్కారాలు పెడుతూనే ఉన్నారు. అనంతరం, పార్దివదేహం వద్దకు చేరగానే అక్కడే ఉన్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళతో మట్లాడారు. ప్రధాని చేరుకోగానే ఒక్కసారిగా వారిద్దరు కన్నీళ్లపర్యంతమయ్యారు.

చుట్టు పక్కల అందరూ చూస్తుండగానే శశికళ తలపై చెయ్యేసి ఓదార్చారు. అనంతరం అక్కడే ఉన్న సిఎంను అక్కున చేర్చుకుని భుజం తట్టి ఒదార్చారు. జయ పార్దివదేహంకు నివాళులు అర్పించటానికి వెళ్ళిన జయ దేహం వద్ద మహా ఉంటే రెండు నిముషాలు ఉన్నారేమో. మిగిలిన సమయం మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రముఖులను చూడటానికి, ప్రజలకు అభివాదం చేయటానికే ఎక్కువ సమయం గడపటం గమనార్హం.