నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు అయిన కొద్ది నెలల ముందు జరిగిన భాజపా నేతల లావాదేవీలను బటయపెట్టాలని ప్రతిపక్షాలు మోడిని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోడి భలే కామిడీ చేస్తున్నారు. నవంబర్ 8 నుండి డిసెంబర్ 31వ మద్య భారతీయ జనతా పార్టీ ఎంపిలు, ఎంఎల్ఏల బ్యాంకు లావాదేవీల వివరాలను అందచేయాలని ఆదేశించారు. అది కూడా జనవరి 1వ తేదీకి సమర్పించాలట. కామిడీ కాకపోతే, నోట్ల రద్దు తర్వాత ఎవరైనా తమ ఖాతాల ద్వారా నల్లధనం లావాదేవీలు నడుపుతారా?
ప్రతిపక్షాలు అడుగుతున్నది ఒకటైతే, మోడి చేస్తున్నది మరోటి. నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు అయిన కొద్ది నెలల ముందు జరిగిన భాజపా నేతల లావాదేవీలను బటయపెట్టాలని ప్రతిపక్షాలు మోడిని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై మాత్రం ప్రధాని నోరు విప్పటం లేదు. కోలకతా, రాజస్ధాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో భాజపా నేతలు పెద్ద ఎత్తున నగదును 8వ తేదీ ముందు డిపాజిట్ చేసారన్నది ప్రతిపక్షాల ఆరోపణలు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తగ్గట్లే 8వ తేదీ తర్వాత భారీ ఎత్తున దొరికిన పెద్ద నోట్లు, ఇపుడు దొరుకుతున్న కొత్త రూ. 2 వేల నోట్లన్నీ అధికారపార్టీ నేతల వద్దే దొరుకుతుండటం గమనార్హం. అటువంటి వారిపై చర్యలు ఏమీ తీసుకున్నట్లు కనబడలేదు. ఇపుడు నవంబర్ 8- డిసెంబర్ 31వ తేదీ మధ్య లావాదేవీల వివరాలను సమర్పించాలని ఆదేశించటమంటే ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలనుకోవటమే.
పైగా ప్రధానమంత్రి ఆదేశాల తర్వాత తమ ఖాతాల్లో మహా వుంటే ప్రభుత్వం వారికి నెలవారీ చెల్లించే జీత, భత్యాలుంటాయి. వాటినే ఎంఎల్ఏలు, ఎంపిలు ప్రభుత్వానికి సమర్పిస్తారు. అక్కడితో వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఊహించని రీతిలో దేశవ్యాప్తంగా తలెత్తిన పరిణామాలు మోడిని మానసికంగా దెబ్బతీసిందేమో అని ప్రజలకు అనుమానం వస్తే అది వారి తప్పు ఎంతమాత్రం కాదు.
మొన్నటికి మొన్న ఏదో ఓ సర్వే సంస్ధ పేరుతో 85 శాతం మంది ప్రజలు నోట్ల రద్దును స్వాగతిస్తున్నారని ప్రకటించుకోవటం, తర్వాత నమో యాప్ ద్వారా తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణలో 93 శాతం మంది ప్రజలు తన చర్యకు మద్దతు తెలుపుతున్నారని చెప్పుకోవటం చూస్తుంటే పాపం ప్రధానికి ఏదో అయిందనే అనుమానాలే ప్రజల్లో బలపడుతున్నాయేమో.
