మోడి హవా ఉందనుకుంటే అన్నీ రాష్ట్రాల్లోనూ కనబడాలి. ఒక్క యుపి, ఉత్తరాఖండ్ లో మాత్రమే అధికారంలోకి వచ్చిందంటే అక్కడి స్ధానిక పరిస్ధితుల కారణంగానే అని స్పష్టమవుతోంది.

అందరినీ ఉత్కంఠకు గురిచేసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. యుపిలో భాజపాకు ఊహించని ఫలితాలు వచ్చినా పంజాబ్, గోవా, మణిపూర్ లో అధికారాన్ని కోల్పోయింది. ఉత్తరాఖండ్ లో కూడా భాజపా మంచి విజయమే సాధించింది. కాకపోతే యుపిలోని 403 సీట్లలో 310 స్ధానాల్లో మెజారిటీలో ఉంది. ఇంతస్ధాయి మెజారిటీ భాజపా కూడా ఊహించలేదన్నది వాస్తవం. ఇకపోతే, అధికారంలో ఉన్న పంజాబ్, గోవా రాష్ట్రాలను చేజార్చుకున్నది. మణిపూర్ లో కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకున్నది.

పంజాబ్ లో కమలం పార్టీ అధికారం కోల్పోతుందన్నది అందరూ అనుకుంటున్నదే అయినా గోవాలో కూడా అధికారం కోల్పోవటం మాత్రం భాజపాకు ఊహించని షాకే. మొత్తం మీద దెబ్బతిన్న పార్టీ ఏదన్నా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)మాత్రమే. పంజాబ్ లో అధికారంలోకి వస్తుందా అన్నంత స్ధాయిలో ఆప్ పోరాడింది. అందరూ అనుకున్నట్లుగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం కమలం పార్టీపై కనబడలేదన్నది స్పష్టమైంది. కాకపోతే కుల, మతాల ప్రభావం ఎక్కువగా ఉండటం, సిఎం అఖిలేష్ కుటుంబంలో వచ్చిన వివాదాల ప్రభావం ప్రతికూలంగా కనబడటం లాంటివి భాజపాకు బాగా అందివచ్చాయి.

మొత్తం మీద యూపి, ఉత్తరాఖండ్ లో కమలం వికసించినా, పంజాబ్, గోవాలో మాత్రం దెబ్బతిన్నది. నిజానికి మోడి హవా ఉందనుకుంటే అన్నీ రాష్ట్రాల్లోనూ కనబడాలి. ఒక్క యుపి, ఉత్తరాఖండ్ లో మాత్రమే అధికారంలోకి వచ్చిందంటే అక్కడి స్ధానిక పరిస్ధితుల కారణంగానే అని స్పష్టమవుతోంది. మొత్తం మీద మణిపూర్లో తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలపై వ్యతిరేకత ఉందన్న విషయం మాత్రం స్పష్టమైంది.