తెలంగాణ మొక్క జొన్న రైతులకు ఊరట

మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో వనపర్తి మార్కెట్ సమస్య పరిష్కారమయింది.వనపర్తి వ్యవసాయ మార్కెట్ లో తలెత్తిన సమస్యను మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకొని రైతులకు వూరట కలిగేలా పరిష్కరించారు. బుధ,గురువారాలలో వనపర్తి పట్టణంలో కురిసిన అకాల వర్షాలకు మార్కెట్ లోని 'మక్కలు'తడిశాయి.దీంతో మక్క రైతులు ఆందోళనకు దిగారు.తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ సమాచారం అందిన వెంటనే మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగి వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ నిరంజన్ తో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని,వారి సమస్యలను సానుభూతి తో పరిష్కరించాలని జె.సి.ని మంత్రి ఆదేశించారు. జె.సి.నిరంజన్ వనపర్తి మార్కెట్ కు హుటాహుటిన చేరుకొని రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. తడిసిన మక్క లకు క్వింటాలుకు 150 రూపాయలు అదనంగా ఇవ్వాలని రైతులు జె.సి.ని కోరారు. మార్కెట్ కమిటీ అధికారులు, జాయింట్ కలెక్టర్ వ్యాపారులను ఒప్పించి రైతులు కోరిన రేటుకు కొనేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి హరీశ్ రావు చొరవతో తమను ఆదుకునే చర్యలు తీసుకున్నారని మక్క రైతులు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.
