99 సంవత్సరాల తర్వాత అక్కడ తొలిసారి సూర్యగ్రహణం..!

Millions of Americans to gaze upon Mondays once in a lifetime eclipse
Highlights

  • అమెరికాలో దాదాపు 30మిలియన్ ప్రజలు ఈ గ్రహణాన్ని చూస్తారని అంచనా
  • ఒరేగాన్‌లోని న్యూపోర్ట్‌లో ప్రారంభమై.. దక్షిణ కరోలినా ప్రాంతంలోని చార్లెస్టన్‌ ప్రాంతంలో గ్రహణం ముగియనుంది.

 

ఆగస్టు 21వ తేదీ కోసం అమెరికా వాసులు ఎంతో ఆత్రుతతో  ఎదురుచూస్తున్నారు. అంత ప్రత్యేకత ఏముందో ఆ రోజుకి అనుకుంటున్నారా.. అవును వారికి ఆరోజు ప్రత్యేకమే. ఎందుకంటే 99 సంవత్సరాల తర్వాత తొలిసారిగా అక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అందుకే దానిని ఎలాగైనా చూడాలని వారు భావిస్తున్నారు.

ఆ రోజు చంద్రుని నీడ సూర్యునిపై సూటిగా పడనుంది. ఈ దృశ్యాన్ని చూడటాన్ని ఎక్కువ మంది చూసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మానవ చరిత్రలో సూర్యగ్రహణాన్ని ఎక్కువ మంది వీక్షించడం ఇదే అవుతుందని  ఆస్ట్రానమార్ రిక్ ఫీన్ బర్గ్ తెలిపారు.

అమెరికాతోపాటు భారత్, నేపాల్, బంగ్లేద్ దేశాలలోనూ స్వల్పంగా గ్రహణం కనపడుతుందని వారు పేర్కొన్నారు. ఆ రోజు చంద్రుడు 113 కిలోమీటర్ల వెడల్పు, 4వేల కిలోమీటర్ల పొడువుతో కనిపిస్తాడని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలో దాదాపు 30మిలియన్ ప్రజలు ఈ గ్రహణాన్ని చూస్తారని అంచనా.

1918 తర్వాత ఆగస్టు 21న ఆమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అమెరికాలో ఒరేగాన్‌లోని న్యూపోర్ట్‌లో ప్రారంభమై.. దక్షిణ కరోలినా ప్రాంతంలోని చార్లెస్టన్‌ ప్రాంతంలో గ్రహణం ముగియనుంది.

 

ఇదిలా ఉండగా.. మరోవైపు కంపెనీలు కూడా దీనిని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత కనిపిస్తుండటంతో దీనిని వీక్షించాలని వారు కోరుకుంటున్నారు.  అయితే.. సోమావారం  పని దినం కావడంతో ఉద్యోగుల కోసం కంపెనీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

గ్రహణం సందర్భంగా ఏం చేయాలి? ఏం చేయకూడదో వివరిస్తూ పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలను ఇస్తున్నాయి. ‘ఎమర్సన్‌ ఎలక్టిక్స్‌’ కంపెనీ తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కళ్లద్దాలను అందిస్తోంది. తమ కంపెనీలో 1400 మంది ఉద్యోగులు ఉన్నారని.. వారు సూర్యగ్రహణ దృశ్యాలను చూడాలనుకుంటే సన్‌గ్లాసెస్‌ పొందొచ్చని కంపెనీ పేర్కొంది. గ్రహణం ప్రారంభం కాగానే ఉద్యోగులు భవనం పైఅంతస్తుకు చేరుకొని.. ప్రత్యేకంగా అందించిన అద్దాలను ధరించి ఆ దృశ్యాలను చూడాలని కోరింది.

సూర్యగ్రహణం సందర్భంగా ‘టెల్‌నెట్‌ప్లస్‌’ కంపెనీ తమ ఉద్యోగుల కోసం విందు కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తోంది. సూర్యగ్రహణ దృశ్యాలను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆహారం, డ్రింక్స్‌ అందిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా తమ కంపెనీలోని 4 వేల మంది ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నట్లు మోన్‌సాంటో తెలిపింది.

loader