బోగస్ సర్వేలు మానుకుని,  లోక్ సభను రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలకు సిధ్దం కావాలని మాయావతి ప్రధానికి సవాల్ విసిరారు

మొట్టమొదటిసారి పార్లమెంటులో మధ్యంతర ఎన్నికల మాట వినిపించింది ఈ రోజు.

బోగస్ సర్వేలు మానుకుని, ధైర్యముంటే లోక్ సభను రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలకు సిధ్దం కావాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.

ఒక యాప్ తయారు చేసి, అనుకూలమయిన ప్రశ్నలను, అందులో కూడానో అని చెప్పడానికి వీల్లేని ప్రశ్నలు వేసుకుని అదే నోట్ల రద్దు మీద రెఫరెండం గా ప్రధాని అండ్ కో ప్రచారం చేసుకుంటున్నారని ఆమె అభ్యంతరం చెపారు.

ఇలాంటి సర్వేల ద్వారా ప్రజాభిప్రాయం కూడగట్టుకోవాలనుకోవడం ఏమిటనిప్రశ్నించారు.

నిజంగా ప్రజాభిప్రాయం కనుగొనాలనుకుంటే, పార్లమెంట్ ను రద్దు చేసి, దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఆమె సవాల్ విసిరారు. ’యాప్ సర్వే నకిలి. అదొక స్పాన్సర్డ్ సర్వే’ అని ఆమె విమర్శించారు.

నోట్ల రద్దు అంశంపై చర్చకు రమ్మంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటుకే రావడం మానేయడమేమిటని ప్రశ్నించారు.

మీరెందుకు పారిపోతున్నారని మాయావతి రాజ్యసభలో ప్రధానిని అన్నారు.

నోట్ల రద్దుపై ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆమెతోపాటు పలు ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టడంతో డిప్యూటీ స్పీకర్ సభను మధ్యాహ్నం 12కు వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోనూ ఆమె ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తర్వాత ఈ అంశం మీద చర్చ మొదలయింది. మాజీ ప్రధాని కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు మన్మోహన్ సింగ్ చర్చను ప్రారంభించారు.