తరగతి గదిలో నిద్రించిన ఉపాధ్యాయుడు ఫోటో తీసి వాట్సాప్ లో పంపిన గ్రామస్థుడు 

తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. విధి నిర్వహణను మరిచి ప్రవర్తించాడు. విషయాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారి అతనిపై వెంటనే చర్యలు తీసుకున్న సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాములు అనే గణిత ఉపాధ్యాయుడు మిడ్జిల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించకపోగా.. కుర్చీలో కూర్చొని నిద్రపోయాడు.

గమనించిన ఓ గ్రామస్థుడు .. ఉపాధ్యాయుడు నిద్రిస్తుండగా ఫోటో తీసి వాట్సాప్ ద్వారా జిల్లా విద్యా శాఖాధికారికి పంపించాడు. దానిని చూసిన ఆయన.. వెంటనే రాములుపై చర్యలు తీసుకున్నారు. అతనిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.