పెళ్లయి ఓ పిల్లాడికి తండ్రయి ఉండి కూడా ఓ యువకుడు వేూరే యువతి మోజులో పడ్డాడు. దీంతో ఆ విషయం తెలిసి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటు ప్రియురాలితో విభేదాలు తలెత్తడం, ఆమె తన బంధువులతో దాడి చేయించడంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చివరకు ఈ మనోవేధన తట్టుకోలేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ ఘటనపై రైల్వే పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన మామిడి కమలాకర్ (25)కు భార్య సరిత, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. అయినా ఇతడు తన పక్క గ్రామం రేపాకకు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. దాన్ని ప్రేమగా భావించి ఆమెతో చాటింగ్ చేయడం, ఫోన్ లో మాట్లాడటం చేసేవాడు. దీంతో ఈ విషయం తెలిసి కమలాకర్ తో గొడవపెట్టుకున్న సరిత పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక ఇటు ప్రియురాలితో కూడా ఇతడికి చెడింది. దీంతో ఆమె తన బంధువులతో కలిసి వచ్చి కమలాకర్ పై దాడి చేయడమే కాకుండా తీవ్రంగా అవమానించింది. దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

దీంతో ఓ సూసైడ్ లెటర్ రాసిపెట్టి ఎల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని జయగిరి రైల్వే గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలు చేసిన అవమానాన్ని తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మరణానికి ఆమే కారణమని సూసైడ్ నోట్‌లో కమలాకర్ రాశాడు. ఈ సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.