దేశ రాజధానిలో ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రంగుల పండగ హోలీ రోజు తలెత్తిన చిన్న వివాదం.. హత్యాయత్నానికి దారి తీసింది. దాదాపు 20 మంది యువకులు కలిసి ఓ యువకుడిని దారుణంగా కత్తితో పొడిచి దాడికి పాల్పడ్డారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఖాన్‌పూర్‌కు చెందిన అశిష్ అనే యువకుడు గురువారం సాయంత్రం జిమ్‌ నుంచి బయటకు వచ్చాడు. అంతలో సుమారు 10 బైక్‌లు అక్కడికి దూసుకొచ్చాయి. వాటిపై వచ్చిన 20 మంది యువకులు అశిష్ పై కత్తులతో, రాడ్లతో దాడి చేశారు. అంత మంది ఒకేసారి అతనిపై దాడి చేసే సరికి ప్రతిఘటించలేకపోయాడు. స్థానికులు కూడా ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు. 

 

దాడి అనంతరం అంతే వేగంగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఆపై స్థానికులు అశిష్ ను ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడికి 50 కత్తిపోట్లు తగిలాయని.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ దాడితో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

అంతకు ముందు రోజు ఉదయం హోలీ వేడుకల్లో స్థానికంగా ఓ చిన్న ఘర్షణ నెలకొంది. ఓ బాలుడు రంగుల బెలూన్లను ఇద్దరు వ్యక్తులపై పొరపాటున విసిరాడు. దీంతో వారు ఆ బాలుడిని చితకబాదగా.. అశిష్ జోక్యం చేసుకుని బాలుడిని రక్షించాడు. దానిని మనుసులో పెట్టుకొనే.. అశిష్ ని చంపేందుకు ప్రయత్నించారని పోలుసులు భావిస్తున్నారు.