ఆకతాయిల వేధింపులు.. సాధారణ యువతులకు మాత్రమే కాదు.. సెలబ్రెటీల కూతుర్లకు కూడా తప్పడం లేదు. క్రికెట్ దేవుడు.. సచిన్ టెండుల్కర్ కుమార్తెని కూడా ఓ ఆకతాయి.. వేధించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెడుతున్నాడు.అసలు విషయం ఏమిటంటే.. పశ్చిమ బెంగాల్ కి చెందిన ఓ 32 ఏళ్ల వ్యక్తి సచిన్ టెండుల్కర్ కుమార్తె సారాకి పలు మార్లు ఫోన్ చేశాడు. అంతేకాకుండా సారాతో అతను అసభ్యంగా మాట్లాడాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఒప్పుకోకపోతే  కిడ్నాప్‌ చేస్తానని కూడా  బెదిరించాడు. దీంతో ఆమె ముంబయిలోని బాంద్రా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ కాల్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి అతనిని పట్టుకున్నారు.  పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి అతనిని పట్టుకున్నట్లు చెప్పారు. అతనిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన  దేబ్ కుమార్ గా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతనిని రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.