మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగ్లీ జిల్లా కడెగావ్ వాంగి సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఓ  ట్రాక్టర్‌, క్రూజర్‌ వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఐదుగురు కుస్తీవీరులతో పాటు ఓ డ్రైవర్‌ దుర్మరణం చెందారు.

ఈ విషాద ఘటనకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా పలూస్‌ తాలుకా కుండల్‌ గ్రామంలోని క్రాంతి కుస్తీ బృందానికి చెందిన సుమారు 12 మంది ఔంద్‌ యమాయీ దేవీ జాతరలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ కుస్తీలు ముగిసిన తర్వాత ఓ క్రూజర్‌ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో కడెగావ్‌ వాంగి సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న క్రూజర్‌ వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌, ఢీకొట్టింది. వీరు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో ఉండటంతో నుజ్జునుజ్జయింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు పహిల్వాన్ లతో పాటు డ్రైవర్ ఉన్నాడు.

మృతుల వివరాలు : ఆకాశ్‌ దేశాయ్‌, విజయ్‌ పాటిల్‌, సౌరబ్‌ మానే, అవినాశ్‌ గైక్వాడ్‌, శుభామ్‌ ఘరగేలు ప్రమాద స్థలిలోనే చనిపోగా,  డ్రైవర్‌ రణజీత్‌ ధనవడే చికిత్స పొందుతూ మృతిచెందాడు.

మరో ఏడుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.