Asianet News TeluguAsianet News Telugu

ఇళయరాజా కరెక్టే కదా...

దండుకోవడమే తప్ప పంచుకోవడం తెలియని మాయా ప్రపంచంలో ఇళయ రాజా నిర్ణయం వల్ల ఆర్ధికంగా చితికిపోయిన వారి కుటుంబాలకు మేలు జరుగుతుందని ఆశిద్దాం

maestro Ilayarajas legal notice to SP is bound to help many forgotten composers
  • Facebook
  • Twitter
  • Whatsapp

కళ్యాణి-ఇది అప్పట్లో అక్కినేని నిర్మాతగా దాసరి దర్శకత్వంలో వచ్చిన సినిమా.మురళీమోహన్,జయసుధ నాయికానాయికలు.మూల కథ మాదిరెడ్డి సులొచన.కానీ హిందీలో అమితాబ్,జయబాధురి నటించిన అభిమాన్ చాయలు ఉంటాయి.కళ్యాణి సినిమాకు సంగీతం రమేష్ నాయుడు అందించాడు.

 

ఇందిలో లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను అనే పాట రెండు వెర్షన్స్ లో ఉంటుంది...

 

బాలు పాడిన పాటలో...ఏ ఫలమాశించి మత్తకోకిల ఎలుగెత్తిపాడును?ఏ వెల ఆశించి పూచేపువ్వు తావిని విరజిమ్మును?అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్ధం.ఏ సిరికోరి పోతన్న భాగవత సుధలు చిలికించెను,ఏ నిధి కోరి త్యాగయ్య రాగజలనిధులు పొంగించెను..రమణీయ కళావిష్కృతికి రసానందమే పరమార్ధం అని ఉంటుది.

 

కథాపరంగా నాయకుడు శాంతినికేతన్ లో చదివి వచ్చిన పెద్దింటి అబ్బాయి...ఆయనకు పాటలు,సంగీతం ఒక హాబీ.

 

మరి కథా నాయికేమో దిగువ మధ్యతరగతి అమ్మాయి...పాట కచేరీలు చేసి కుటుంబాన్ని పోషించుకోవాలి...నాయకుడి పాట విన్న ఆవిడ గట్టిగా జవాబిస్తుంది...

 

కృతిని అమ్మని పోతన్నకు మెతుకే కరువై పోలేదా?బ్రతికి ఉండగా త్యాగయ్యకు బ్రతుకే బరువైపోలేదా?

 

విరిసిన కుసుమం వాడిపోతే కరుణ చూపేదెవరు?పాడే కోకిల మూగవోతే పలకరించేదెవరు?

 

కడుపునింపని కళలెందుకు?తనకు మాలిన ధర్మమెందుకు? 

 

ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము?ఎంతవరకీ బంధము?నిజంగా తోటి వారికి కాదు తోబుట్టువులకే కష్టం వస్తే ఆదుకుంటామా?

maestro Ilayarajas legal notice to SP is bound to help many forgotten composers

ఆ సంగీత దర్శకుడు ఘంటసాల గారి సహాయకుడు...."వీణ నాది తీగ నీది,తీగ చాటు రాగముంది" అంటూ తీగలోని రాగాలు వినిపించాడు..."ఈదురుగాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగింది" అంటూ గుబులు పుట్టించాడు..."జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" అన్న రామాయణ వాక్యానికి అధ్బుతమైన బాణీ ఇచ్చి "సంభవం నీకే సంభవం" అనిపించుకున్నాడు...కానీ జీవితం ఒకేలా ఉండదు.."ఎడ్డమంటే తెడ్డెమంటె నడ్డి విరిగిపోతాది" అన్నట్టు అయింది.....చివరికి ఒకరోజు మతిస్థిమితం కోల్పోయి రైల్వే పాల్ట్‌ఫాం మీద కనిపించాడు...చివరికి పేదరికంతో చనిపోయాడు...మరి అభిమానులెవరన్నా సాయం చేసారా?"ఈ జీవన తరంగాలలో" ఎవరికి ఎవరు సొంతము?ఆ సంగీత దర్శకుడు జె.వి.రాఘవులు(కుడి ఫోటో) అని ఈ పాటికి గ్రహించే ఉంటారు కదూ.

 

 

ఇది ఒక్క రాఘవులు వ్యధ మాత్రమే కాదు...70,80 దశకాల్లో కన్నడ,తెలుగు శ్రోతలను అలరించిన పూజ,నాలుగు స్తంబాలాట,పంతులమ్మ,ఇంటింటి రామాయణం,సొమ్మొకడిది సోకొకడిది తదితర చిత్రాల సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర (కిందిఫోటో) సోదరుల్లో నాగేంద్ర గారి అబ్బాయి బెంగుళూరు లోని ఒక పార్క్ లో పిల్లలకు సంగీత పాఠాలు చెబుతూ బతుకుతున్నాడు.

maestro Ilayarajas legal notice to SP is bound to help many forgotten composersమనకు తెలిసింది వీరు..తెలియని వారెందరో.....

 

సంగీతాని మేధోసంపత్తి హక్కులు కోరుతూ కోర్టుల్లో ఎన్నో కేసులు నడిచాయి....ఇటీవల ముంబాయ్ కోర్ట్ తీర్పును అనుసరించి స్టేజ్ షోలు చేసిన,వాణిజ్య ప్రయోజనాలతో రేదియోల్లో,ఇతర ప్రదేశాల్లో వినిపించినా సంగీత దర్శకుడికి,రచయితకు,నిర్మాతకు రాయల్టీ చెల్లించాలి.వీరి తదనంతరం 60ఏళ్ల పాటు వారి కుటుంబ సభ్యులకు రాయల్టీ ఇవ్వాలని ఆ తర్వాత అవి ప్రజాపరం అవుతాయని తీర్పుంది.

 

ఇప్పుడు ఇళయరాజా దేశవిదేశాల్లో కచేరీలు నిర్వహిస్తున్న బాలు కు కోర్ట్ నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది.నిజానికి బాలు ఏ చారిటీ షో చెయ్యడం లేదు..ఒక్కో కార్యక్రమం మీద సుమారు 50 లక్షల దాకా మిగులుతుందని చెబుతారు...మరి ఒకరి మేధో సంపత్తి ఉపయోగించుకుంటూ రాయల్టీ చెల్లించమంటే ఏకంగా ఇళయరాజా పాటలు పాడననేసాడు.

 

ఇది ఒక్క ఇళయరాజా పోరాటం కాదు దీనివల్ల ఆర్ధికంగా చితికిపోయిన సంగీతదర్శకులు,రచయితల,నిర్మాతల కుటుంబాలకు అంతోఇంతో డబ్బుముడుతుంది.తన చిరకాల మిత్రుడైన రాజా తో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోక మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్టుంది బాలు వ్యవహారం అని అంటున్నారు.

 

గాయకులు సంగీతంలో ఒక భాగమే అని చాలామంది అభిప్రాయం...గాయకులను సూపర్ స్టార్స్ చెయ్యగల సత్తా సంగీత దర్శకులదే...

 

నీ లీల పాడెద దేవా.. అంటూ సన్నాయితో పోటీపడ్డ అద్భుత స్వరం జనకమ్మది...అయితేనేం నల్లవాడే అల్లరిపిల్లవాడే(దసరాబుల్లోడు),ఆరనీకుమా ఈ దీపం(కార్తీకదీపం),అమ్మతోడు అబ్బతోడు(అడవిరాముడు)తదితర పాటల్లో సెకండ్ హీరోయిన్‌కు పాడించేవారు...కానీ రాజా ఆవిడతో అద్భుత ప్రయోగాలు చేసాడు,జాతీయ పురస్కారాలు పొందేట్లు చేసాడు...చిత్ర కు వచ్చిన తొలి రోజుల్లోనే జాతీయ పురస్కారం రాజా సంగీతంలో లభించింది.ఆవిడ గెలిచిన ఆరింటిలో సింధుభైరవి ఒకటి కాగా హింది లో ‘విరాసత్’ లోని పాటా రాజా బాణీయే కావడం విశేషం.

 

ఇక తెలుగులో అవకాశాలన్నీ బాలుకు,కొద్దొగొప్పో మనో(నాగూర్‌బాబు)కు ఇచ్చినా తమిళ్ లో ఇతరగాయకు పాడిన పాటలనూ బాలూ కే ఇచ్చాడు...ఉదా-లలిత ప్రియకమలం..రుద్రవీణ(ఏసుదాస్),జాబిల్లికోసం ఆకాశమల్లే..మంచిమనసులు(జయచంద్రన్),మాటే మంత్రము..సీతాకోకచిలుక(ఇళయరాజా).....

 

ఇక తమిళ్ లో జయచంద్రన్,మలేషియా వాసుదేవన్,దీపన్ చక్రవర్తి లను ప్రోతహించగా....ఉమా రమణన్,జెన్సీ,స్వణలత,సుజాత లాంటి ఎందరికో అవకాశాలిచ్చాడు...కవికుయిల్ సినిమాలో మంగళంపల్లి బాలమురళీకృష్ణతోనూ పాడించాడు.

 

మీ పాటకు వందశాతం న్యాయం చేసిన వారెవరని అడిగితే అజోయ్ చక్రబొర్తి అన్నాడు..గుర్తుందా హే రామ్ లోని పాట?

 

ఏదేమైనా రాజా నిర్ణయం వల్ల ఆర్ధికంగా చితికిపోయిన వారి కుటుంబాలకు మేలు జరుగుతుందని ఆశిద్దాం.

Follow Us:
Download App:
  • android
  • ios