చమురు సంస్థలు వినియోగదారులకు హోలీ కానుక అందించాయి. ఎల్పీజీ, వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి.  వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల సిలిండర్ ధరలను కూడా తగ్గించాయి. తగ్గిన సిలిండర్ ధరలు మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్ సైట్ లో గ్యాస్ సిలిండర్ ధరలు పట్టిక కూడా వెల్లడించింది.

ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం, 14.2 కిలోల సబ్సిడీ లేని గృహ సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్ రూ.45.50 నుండి 47 రూపాయలకు తగ్గింది. ఢిల్లీలో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర రూ.47 తగ్గి రూ. 689కు పడిపోయింది. కోలకతాలో సిలిండర్ల ధర రూ.45.50 తగ్గి రూ.711.50కు చేరుకుంది. ముంబయిలో రూ.47 తగ్గి రూ.661కు చేరుకుంది. చెన్నైలో రూ. 46.50 తగ్గి  ప్రస్తుతం రూ. 699.50కు చేరుకుంది.

సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల ధరలను ఇండియన్ ఆయిల్ రెండున్నర రూపాయలకు పైగా తగ్గించింది. మార్చి 1 నుంచి సబ్సిడీ సిలిండర్లకు ఢిల్లీలో రూ.493.09 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు రూ.495.63 చెల్లించాల్సి ఉండేది. కోలకతాలో సిలిండర్ ధర రూ.2.53 తగ్గి రూ.496.60కు, చెన్నైలో సిలిండర్ ధర రూ.2.48 తగ్గి రూ.481.21కు చేరుకుంది.