ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని మనం పుస్తకాల్లో చదివుంటాం. కానీ, వాస్తవంలోకి వస్తే ప్రేమ చావునే కోరుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఉమ్మడి ఏపీకి అగ్రస్థానం కూడా దక్కింది.
దేశంలో ఎక్కడైన ఉగ్రదాడి జరిగితే ఉలిక్కిపడుతాం. టెర్రరిస్టులు అమాయకులను పొట్టనపెట్టుకున్నారనిబోరుమంటాం. అయితే దేశంలో ఉగ్రచావులకంటే ప్రేమ చావులే ఎక్కువని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గత 15 ఏళ్లలో ప్రేమ పేరుతో జరిగిన హత్యలు దేశవ్యాప్తంగా 38, 585 గా నమోదవగా, ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 79, 189 గా ఉంది.
ప్రేమ, పెళ్లి పేరుతో కిడ్నాప్ కు గురైన వారు 206,000 మంది ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలు, దాడుల వల్ల దేశంలో గత 15 ఏళ్లలో చనిపోయింది కేవలం 20,000 మంది మాత్రమే.
ప్రేమ వల్ల రోజుకు 14 మంది ఆత్మహత్య చేసుకుంటుంటే, 47 మంది అపహరణకు గురవుతున్నట్లు తాజా గణాంకాల వల్ల తెలుస్తోంది.
ప్రేమ కారణంగా హత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో ఈ విషయంలో ఫస్ట్ ర్యాంకు ఏపీ దక్కించుకోగా తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ లు నిలిచాయి. ఈ రాష్ట్రాల్లో సగటున 3 వేల మంది హత్యగావించపబడుతున్నారు.
కాగా, ప్రేమ కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు, అస్సాం, ఏపీ, ఒడిషా, మధ్యప్రదేశ్ లు నిలిచాయి. కుల, మతాల పట్టింపులే ప్రేమ వైఫల్యానికి ప్రధాన కారణంగా తేలింది. మొత్తంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రప్రాంతాలు కలపి చూస్తే 19 రాష్ట్రాల్లో పురుషులకంటే మహిళలే ప్రేమ కారణంగా ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారట. జాతీయ నేర గణాంకాల నుంచి సేకరించి డాటా ఆధారంగా ఈ విషయాలు బయటపడ్డాయి
