జుట్టు ఒత్తుగా, పొడుగ్గా అందంగా ఉండాలని ఏ అమ్మాయి మాత్రం కోరుకోదు చెప్పండి.? అందుకోసం మార్కెట్ లో దొరికే అన్ని రకాల నూనెలు, షాంపూలు, కండిషనర్లు వాడేస్తుంటారు. వారానికోసారైనా హెన్నాలు పెడుతుంటారు.  ఇలా ఎన్ని చేసినా జుట్టు రాలడం మాత్రం ఆగడం లేదు.. మరి జట్టు రాలడం సమస్యకు చెక్ పెట్టాలంటే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం.. కుదుళ్లు బలంగా ఉంటే.. జుట్టు రాలడం తగ్గుతుంది. ఎన్ని రకాల నూనెలు, షాంపూలు, కండిషనర్లు వాడినా అవన్నీ పైపై మెరుగులే. వాటితో పాటు జుట్టుకి పోషణ అందించాలి. ఆ పోషణ మీరు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం...

ఆకుకూరలు.. ఇక జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేయడంలో ఆకుకూరలు ఎంతో కీలకం. ముఖ్యంగా పాలకూర. ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకలు చిట్లకుండా, పెళుసుగా మారకుండా నిరోధిస్తుంది. 
 

చేపలు, గుడ్లు.. చేపల్లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుకు పోషణ అందించే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా వీటి నుంచే లభిస్తాయి. తరచూ చేపల్ని తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. గుడ్డులో జింక్‌, సల్ఫర్‌, ఐరన్‌, సెలీనియం లాంటి మూలకాలుంటాయి. ఇవి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. 


వాల్ నట్స్... బాదం, వాల్‌నట్‌, జీడిపప్పూ, గుమ్మడి, పొద్దుతిరుగుడు వంటి విత్తనాల్లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయ ఆహారంగా శాఖాహారులు వీటికి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. అలానే వీటిలోని విటమిన్‌ ఇ, బయోటిన్‌లు జుట్టుకి రక్షణ నిస్తాయి. జుట్టు రాలకుండా నియంత్రిస్తాయి. వాల్‌నట్స్‌లో ఉండే జింక్‌ జుట్టుకి సహజమైన రంగునూ, తేమనూ అందించి నిగనిగలాడేలా చేస్తుంది. 
 

 క్యారెట్‌.. క్యారెట్ కేవలం కంటికి మాత్రమే కాదు జుట్టూకూ మంచిదే. ఎందుకంటే దీనిలో విటమిన్‌ ఎ ఎక్కువగా ఉంటుంది. దీని లోపం వల్ల మాడు ఎండిపోయిట్లై, చుండ్రు సమస్య కూడా కనిపిస్తుంది. కాబట్టి క్యారెట్‌తోపాటు విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండే చిలగడ దుంపలు, గుమ్మడి, మామిడిపండ్లు, ఆప్రికాట్లను ఎక్కువగా తీసుకోవాలి. 
 

జామపండ్లు.. నారింజ పండ్లలో కన్నా ఎక్కువ సీ విటమిన్ జామపండ్లలో ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. కేవలం జామపండ్లలోనే కాదు.. జామ ఆకుల్లోనూ విటమిన్ సి,బి ఉంటాయి. ఇవి కూడా హెయిర్ గ్రోత్ కి సహాయపడతాయి.