చంద్రబాబుని మించిపోయిన లోకేష్

lokesh says he never expected to become minister in early age
Highlights

  • చిన్న వయసులో మంత్రి అవుతానని అనుకోలేదన్న లోకేష్
  • పల్లెటూరికి సేవ చేసే పదవి కావాలని అడిగానన్న లోకేష్

 ‘చిన్న వయసులోనే మంత్రిని అవుతానని అనుకోలేదు’..తాజాగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రకాశం జిల్లాలో మంగళవారం పర్యటించిన లోకేష్ మాట్లాడుతూ, పల్లెటూరికి సేవ చేసే పదవి కావాలని అడిగి తీసుకున్నానని చెప్పటం విచిత్రంగా ఉంది. చిన్న వయసులోనే మంత్రినవుతానని అనుకోలేదట. నారా చంద్రబాబునాయుడు వారసుడి హోదాలో ఉండి పదవులు అందుకోవటానికి వయస్సుతో పనేముంది? వయసు, సామర్ధ్యం లాంటివి ఏవీ అవసరం లేదన్న విషయం అదరికీ తెలుసు. ఎందుకంటే, వారసత్వమే ప్రధాన అర్హతైతే మిగితావి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అంతెందుకు, మాటలు సరిగా రాలేదు కానీ, కొంతకాలం ఆగితే లోకేష్ కొడుకు దేవాన్ష్ కు కూడా ఏదో ఓ పదవి రాకుండా పోతుందా?

ఇక, పల్లెటూరికి సేవ చేసే ఏదో ఓ పదవి కావాలని అడిగి తీసుకున్నట్లు లోకేషే చెప్పారు. నిజానికి పల్లెటూర్లకు సేవ చేయాలంటే మంత్రి పదవే కావాలా? ఓ స్వచ్చంధ సంస్ధను నడుపుతున్నా చాలుకదా? లోకేష్ స్వచ్చంధ సంస్ధను నడుపుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి దొడ్డిదోవన మంత్రవ్వటం ఎందుకు? సరే ఆ విషయం పక్కన పెడితే  ఓ పట్టాన తొందరగా అర్ధం కానీ రుణమాఫీ లెక్కలు కూడా లోకేష్ తన ప్రసంగంలో చెప్పారు.

ప్రకాశం జిల్లాలో వేసిన రోడ్ల గురించి, 2019 నాటికి చేయబోయే రోడ్ల అభివృద్ధి గురించి కూడా వివరించారులేండి. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వర్మీకంపోస్టులు, జనాభా 5 వేల కన్నా ఎక్కువున్న గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేస్తారట. 5 వేలకన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు రాష్ట్రంలో వేలల్లో ఉంటాయి. ఒక్కసారి వేల గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు సాధ్యమేనా? 2019 నాటికి జిల్లాలోని ప్రతీ ఇంటికీ తాగునీరు కూడా అందిస్తామని ప్రకటించేసారు లోకేష్. ఏంటో హామీలివ్వటంలో చంద్రబాబే  అనుకుంటే తండ్రినే మించిపోతున్నాడు లోకేష్ బాబు.  

loader