లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్’ పేరిట ఓ యాప్ ని విడుదల చేశారు రిజిస్టర్ చేసుకోగానే.. మీ ఫోన్ కి ఓ యూనిక్ కోడ్ వస్తుంది

మీ ఇళ్లకు మేము కాపలా ఉంటామంటున్నారు.. నెల్లూరు పోలీసులు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. ఓ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీ సమాచారం అందులో పొందు పరిచే.. మీ ఇంటికి మాదీ భద్రత అని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

నెల్లూరు జిల్లా పోలీసులు ‘ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్’ పేరిట ఓ యాప్ ని విడుదల చేశారు. జిల్లా ప్రజల భద్రత కోసమే తాము ఆ యాప్ ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రామకృష్ణ చెప్పారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్ లో తాము ప్రవేశపెట్టిన యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని అందులో ఇంటి యజమాని పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ వంటి సమాచారంతో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోగానే.. మీ ఫోన్ కి ఓ యూనిక్ కోడ్ వస్తుంది. ఎప్పుడైనా జిల్లాలోని ప్రజలు ఊరు వెళ్లాల్సి వస్తే.. యాప్ ఓపెన్ చేసి ఏ రోజు వెళ్తున్నారో.. మళ్లీ తిరిగి ఏ రోజు వస్తారో.. అందులో రిక్వెస్ట్ వాచ్ పెట్టుకోవాలి.

వారు అలా రిక్వెస్ట్ వాచ్ పెట్టగానే.. ఆ సమాచారం పోలీసు కంట్రోల్ రూమ్ కి చేరుతుంది. దీంతో పోలీసులు ఆ యజమాని ఇంటికి వెళ్లి..వారి ఇంటికి మోషన్ కెమరా మోడెంను అమరుస్తారు. దీని సహాయంతో.. ఆ ఇంటి ముందు ఏవరైనా మనుషులు కదలాడితే.. ఆ సమచారం వెంటనే పోలీసులకు, ఇంటి యజమానికి తెలిసి పోతుంది. అక్కడ జరిగేదంతా రికార్డు కూడా చేస్తుంది. దీంతో దొంగలను పట్టుకోవడం చాలా సులభమవుతుందని ఎస్పీ రామకృష్ణ తెలిపారు.

దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ని ఆయన విడుదల చేశారు. దీనికి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే.. ప్రజలు జిల్లాలోని ఏ పోలీసు స్టేషన్ కైనా ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.