కర్నాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు, రాజస్ధాన్, మహారాష్ట్రలకు చెందిన భాజపా నేతల వద్దే పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ దొరికింది.
కోట్ల కొద్ది కొత్త కరెన్సీ నోట్లు పట్టుపడుతుండటంలో కేంద్రప్రభుత్వం పాత్రపైనే పలు అనుమానాలు కలుగుతున్నాయి. సామాన్యులకు రూ. 2 వేల నోటు దొరకటమే గగనంగా మారుతున్న రోజుల్లో కొందరి వద్ద మాత్రం కోట్ల కొద్దీ కొత్త నోట్లు ఏ విధంగా దొరుకుతున్నాయన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
ఇప్పటి వరకూ పట్టుబడిన వారి వద్ద కొత్త 2 వేల రూపాయల నోట్లే దొరుకుతున్నాయి. దాంతో పాటు బంగారం కూడా పెద్ద ఎత్తున దొరుకుతుడటం గమనార్హం. తాజాగా చెన్నైలోని టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి వద్ద రూ. 110 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లతో పాటు 100 కిలోల బంగారు కడ్డీలు దొరకటమే రికార్డు.
నోట్ల రద్దు తర్వాత భారీ స్ధాయిలో కొత్త 2 వేల నోట్లతో పట్టుబడిన వారందరూ భారతీయ జనతా పార్టీ నేతలే కావటం గమనార్హం. కర్నాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు, రాజస్ధాన్, మహారాష్ట్రలకు చెందిన భాజపా నేతల వద్దే పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ దొరికింది.
అదే విధంగా నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకూ వందల కోట్ల వ్యయంతో జరిగిన వివాహాల్లో కూడా భాజపా, భాజపాకు చెందిన వారివే ఎక్కువ. గాలి జనార్ధన్ రెడ్డి, అరుణ్ జైట్లీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాష్ట్రంలో గురజాల టిడిపి ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు తదిరులున్నారు.
వారంతా తమ పిల్లల వివాహాలకు వందల కోట్లు ఖర్చు చేయటం విశేషం. సామాన్య జనాలు తమ పిల్లల వివాహాలు చేయలేక రద్దు చేసుకుంటుంటే వారాకి మాత్రం కోట్ల కొద్ది డబ్బు ఎక్కడి నుండి వస్తున్నదో అర్ధం కావటం లేదు.
ఇదంతా చూస్తున్న ప్రజలు కేంద్రప్రభుత్వాన్ని, ఆర్బిఐనే అనుమానిస్తున్నారు. కావాల్సిన వారికి ఆర్బిఐ దొడ్డిదారిన వందల కోట్లు అందచేస్తోందన్నఅనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అవసరాలు ప్రతీ ఒక్కరికీ ఒక్కటే. కాకపోతే మనుషుల స్ధాయిలను బట్టి పరిమాణం మరుతుంది.
మరి అటువంటప్పుడు సామాన్యలు, మధ్య తరగతి వారు తమ పిల్లల వివాహాలను వాయిదా వేసుకుంటున్న సమయంలో గొప్ప వారు మాత్రం వందల కోట్లతో వివాహాలు ఏ విధంగా చేయగలుగుతున్నారన్నదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న.
పెద్ద వారికి, గొప్ప వారికి కొత్త కరెన్సీ ఆర్బిఐ గోదాముల నుండే నేరుగా అందుతున్నదా అని అందరూ అనుమానిస్తున్నారు. సామాన్యుల ప్రశ్నలకు ఘనత వహించిన మోడినే సమాధానం చెప్పాలి మరి.
