ఖైరతాబాద్ లడ్డు.. ఫిల్మ్ నగర్ కి ఇలా చేరింది..

Lo and behold The 500 kg laddoo thats the talk of the town
Highlights

  • ఈ గణపయ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. ఆయన చేతిలో ఉంచే తాపేశ్వరం లడ్డుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది
  • గణపయ్యని చూడటం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు

 

గత కొన్ని సంవత్సరాలుగా  ఖైరతాబాద్ వినాయకునికి  తాపేశ్వరం నుంచి లడ్డు రావడం ఆనవాయితీగా మారింది. కానీ ఈ సంవత్సరం... ఖైరతాబాద్ గణపతికి చేరాల్సిన లడ్డు.. ఫిల్మ్ నగర్ గణేషునికి చేరింది.

వివరాల్లోకి వెళితే..వినాయక చవితి వచ్చిందంటే చాలు.. నగరమంతా వినాయకులు కొలువు దీరతారు. అన్ని వినాయకులలోనూ ఖైరతాబాద్ గణేషుని ప్ర్యతేకత వేరు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ వినాయకుడిని తయారు చేస్తారు. ఈ గణపయ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. ఆయన చేతిలో ఉంచే తాపేశ్వరం లడ్డుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆయన చేతిలోని లడ్డు ప్రసాదం కోసం.. గణపయ్యని చూడటం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. కానీ ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడికి లడ్డు చేరలేదు. స్థానిక నాయకుల కుటిల రాజకీయాలే ఇందుకు కారణమని తెలిసింది.

దీనిపై తాపేశ్వరం లడ్డు తయారీదారుడు మల్లి బాబు వివరణ ఇచ్చారు.. ‘ ప్రతి సంవత్సరం మేము ఎంతో భక్తి శ్రద్ధలతో లడ్డు తయారు చేసి ఖైరతాబాద్ వినాయకునికి పంపిస్తుంటాం. ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. మొదటి సంవత్సరం 500కేజీల లడ్డును స్వామి వారికి అందజేశాం. అందులో సగం ప్రజలకు పంపిణీ చేయగా.. మిగిలిన సగం మేము తీసుకొని వెళ్లాము. తర్వాత ఏడాది నుంచి లడ్డు బరువు పెంచుతూ వచ్చాము. ఆ లడ్డుని ప్రజలకు పంపిణీ చేయాలని  ట్రస్టు భావించినా.. స్థానిక నాయకులు అడ్డు తగులుతూ వచ్చారు. ఒక సంవత్సరం అసలు ప్రజలకు పంచిపెట్టకుండా హుసేన్ సాగర్ లో కలిపేశారు. ఈ సంఘటన చాలా బాధకలిగించింది.  గతేడాది లడ్డూని స్వామి వారి చేతిలో కూడా పెట్టలేదు.ఈ ఏడాది అసలు లడ్డు పంపించ వద్దని ట్రస్టు కోరింది. అందుకే ఖైరతాబాద్ గణేశునికి కాకుండా ఫిల్మ్ నగర్ లోని గణేశునికి పంపించాము’ అని బాబు తెలిపారు.

ప్రస్తుతం తాపేశ్వరం లడ్డు ఫిల్మ్ నగర్ వినాయకుని వద్ద ఉంది. 12 అడుగుల వినాయకుని వద్ద ఈ 500 కేజీల లడ్డు.. అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామి దర్శనంతో పాటు లడ్డూని చూడటానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

180కేజీల పంచదార, 140కేజీల నెయ్యి, 155 కేజీల శెనగ పిండి, 25కేజీల డ్రైఫ్రూట్స్ కలిసి తయారు చేశారు. లడ్డు పంపిణీ కూడా ప్రారంభించారు.

loader