ప్రపంచం అంతా గాఢంగా నిద్రపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఒకవ్యక్తి నిశ్శబ్దంగా ఏకాగ్రతతో కళ్ళు పెద్దవి చేసి చూపు మందగిస్తున్నా పని చేస్తూనే ఉంటాడు.అది రాత్రి పన్నెండు కావచ్చు రెండు కావచ్చు నాలుగు కూడా కావచ్చు.పొద్దున్నే తెల్లవారి కూడా పోవచ్చు.అయినా అయన తన పనిని ఆపడు.అయన పేరు "నేతన్న"

ఎందరికో కట్టుకోవడానికి అందమైన గుడ్డని
ఇచ్చిన ఆ నేతన్న తన వంటిమీద గుడ్డని నేయించుకోలేడు.
తరతరాలుగా ఎన్ని బాధలు పడుతున్నా వేరేపనిలోకి
వెళ్ళలేక తన కులవృత్తిని వదలలేక 
ఆ నరకయాతన ఏమని వర్ణించగలం.
ఒక్క చీర నేయడానికి మగ్గం దగ్గర
కూర్చుంటే సెకండ్లు నిముషాలు గంటలు గడచిపోతుంటాయి.
కళ్ళు చేతులు కాళ్ళు అలసిపోయి నొప్పులు తిమ్ముర్లు పడుతున్నా
తన జీవనపోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు.
పదిరోజుల పాటు రెక్కలు ముక్కలు చేసుకొని
నేచిన చీరకి కనీసం వెయ్యి రూపాయలు కుడా రోజులు ఎన్నో..
కానీ అదే చీర అద్దాల మేడల్లాంటి దుకాణాల్లో ఐదువేలకి
ఎగరేసుకుపోతున్నారని తెలిసి కన్నీరు కార్చిన సందర్భాలు మరెన్నో.
ఎన్నో చీరలు ఎంతోమందికి అందించిన నేతన్న కట్టుకున్న
భార్యకు ఒక్క చక్కని చీరని నేయించి ఎన్నేళ్ళయ్యిందో..??
.
రాజకీయనాయకులు ఐదేళ్ళకి ఒకసారి వచ్చి
నేతన్నని ఆదుకుంటాం అని నేతన్నకి అన్నీ చేస్తాం అని
చెప్పిన ప్రతిసారి నమ్ముతున్నాం ఒట్లేస్తున్నాం.
ఎన్నికలు ముగిసిన నాటి నుండి మళ్ళి ఐదేళ్ళవరకు..
ఎన్నో పూటలు పస్తులతో పడుకున్నాం..ఎన్నాళ్ళీ ఆకలి బాధలు?
.
అయినా ఎవరిని ఏమి అడగకుండా ఎవరికీ హాని చెయ్యకుండా..
ఆ చీకటి ఇరుకు గదిలో తన శ్వాశ తనకే వినపడేలా నిశ్శబ్దంగా పని చేసుకుంటాడు.
పిల్లలు ఏమి చేస్తున్నారో ఏమి చదివారో కూడా తెలుసుకోలేడు.
ఎందుకంటే అయన పని అలాంటిది.
కూర్చుంటే లేవలేడు..లేచినా కాసేపే..ఎదో ఒక పని చెయ్యాలని ఆశ.
ఎదో నాలుగు రూకలు కుటుంబం కోసం సంపాదిద్దాం అనే బలీయమైన కోరిక.
.
ఇలా నేతన్ని కష్టాన్ని వారి కుటుంబాలు పడే బాధలు చెప్పనలవి కానివి.
ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నా వారి జీవితాలలో మార్పు లేదు.
నేటికి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు జమ్మలమడుగులాంటి ప్రాంతాల్లో మరియు
అనంతపురం జిల్లాలోని ధర్మవరం తాడిపత్రి లాంటి
ఊర్లలలో నేతన్న పడే బాధలు నేను స్వయంగా చూసినవే.
.
చేనేత పరిశ్రమలలో ఎన్నో ఆధునిక పద్దతులు వచ్చినా ఇంకా పాతకాలం
మగ్గం ద్వారా వస్త్రం నేచి ఇచ్చే నేతన్నలు అదే జీవనాధారం బ్రతికేవారు ఎందరో.
అందులో వారు పడే సాధక బాధలు దగ్గరగా వెళ్ళి స్వయంగా చూడాల్సిందే.
అప్పుడే వారు పడే అసలైన కష్టాలు కన్నీళ్ళు తెలుసుకున్నవారం అవుతాము.
రైతుకు గౌరవం ఇచ్చినట్టే మన నేతన్నకి ప్రతి ఒక్కరూ గౌరవం సంఘీభావం చూపించాలి..
ఒక్కమాటలో చెప్పాలంటే నేతన్న తన శరీరంలోని నరాలనే
దారాలుగా మర్చి రాత్రింబవళ్ళు మనకోసం అందమైన వస్త్రాన్ని తయారుచేస్తున్నాడు.
కాబట్టి నేతన్న బాధ కష్టం మనం తప్పక గుర్తించాలి అని..
చేనేత వస్త్రాలని మన అందరం తప్పక వాడాలని గుర్తు చేస్తూ ఇది రాస్తున్నాను.

* సంజీవ్ కడప జిల్లా ప్రొద్దుటూర్ కి చెందిన సోషల్ వర్కర్; పి.వివేక్ బాబు, జర్నలిస్టు, ప్రొద్దుటూరు