Asianet News TeluguAsianet News Telugu

సిఎంలను కుదిపేస్తున్న భూకుంభకోణాలు

విపక్షాలు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం సిట్ తో విచారణ చేయించాలని నిర్ణయించింది. కుంభకోణంపై బహిరంగ విచారణ జరిపిస్తామని మొదట చెప్పిన ప్రభుత్వం తరువాత మాట మార్చింది. బహిరంగ విచారణ అవసరం లేదని సిట్ చాలంటూ ప్రభుత్వం చెప్పటంతో పలు అనుమానాలకు దారితీసింది.

Land scams rocking both the telugu states

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి బయటపడిన భారీ భూకుంభకోణాలు సిఎంలతో పాటు వారి పుత్రరత్నాలను కుదిపేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోను వేలకోట్ల రూపాయల విలువైన కుంభకోణాలు జరిగాయన్నది వాస్తవం. ప్రభుత్వానికి చెందిన వేలాది ఎకరాల భూకుంభకోణాలకు ముఖ్యమంత్రులతో పాటు వారి పుత్రరత్నాలు కేంద్రబిందువుగా నిలిచినట్లు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయ్.

ఏపిలో విశాఖపట్నం కేంద్రంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారపార్టీ నేతలు భూ కుంభకోణాలకు తెరలేపారు. భీమిలీ కేంద్రంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందిన వేలాది ఎకరాలను టిడిపి నేతలు సొంతం చేసేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వచ్చిన హుద్ హుద్ తుఫాను నేతలు పాలిట కల్పవృక్షంగా మారింది.

తుఫాను దెబ్బకు రికార్డులు కొట్టుకుపోయాయట. మళ్ళీ రికార్డులు తయారు చేసినపుడు వేలాది ఎకరాలు నేతల సొంతమైపోయాయి. సొంతం చేసుకోవటంలో వివిధ నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏలు కీలకపాత్ర పోషించారు. అందులో ఓ మంత్రి, ఐదుగురు ఎంఎల్ఏలు, ఒక ఎంఎల్సీతో పాటు పలువురు నేతలున్నారు.  

వేలాదిఎకరాల భూకుంభకోణం జరిగినట్లు స్వయంగా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే చెబుతున్నారు. ప్రభుత్వ రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా ధృవీకరించటం సంచలనంగా మారింది.  దాంతో ఈ భారీ భూకుంభకోణానికి నారాలోకేషే సూత్రదారునిగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  

విపక్షాలు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం సిట్ తో విచారణ చేయించాలని నిర్ణయించింది. కుంభకోణంపై బహిరంగ విచారణ జరిపిస్తామని మొదట చెప్పిన ప్రభుత్వం తరువాత మాట మార్చింది. బహిరంగ విచారణ అవసరం లేదని సిట్ చాలంటూ ప్రభుత్వం చెప్పటంతో పలు అనుమానాలకు దారితీసింది.

ఇక, తెలంగాణాలో కూడా హైదరాబాద్ కు ఆనుకునే ఉన్న మియాపూర్ కేంద్రంగా భారీ ఎత్తున భూ కుంభకోణం వెలుగు చూసింది. వేలాది ఎకరాలను అధికార పార్టీ నేతలు సొంతం చేసేసుకున్నారు. ఇక్కడా ముఖ్యమంత్రి కెసిఆర్తో పాటు కొడుకు, మంత్రి కెటిఆర్ ప్రధాన లబ్దిదారులని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయ్. ప్రభుత్వానికి చెందిన వేలాది ఎకరాలను గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తి సొంతం చేసుకుని తర్వాత ప్రభుత్వంలోని ముఖ్యులకు బదిలీ చేసారన్నది ప్రతిపక్షాల ఆరోపణలు.

తమ ఆరోపణలకు ప్రతిపక్షాలు ఆధారాలను కూడా చూపుతున్నాయ్. భారీ ఎత్తున భూకుంభకోణం జరిగిందని ప్రాధమిక ఆధారాలు కనిపిస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం ప్రతిపక్షాల డిమాండ్లను ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. మొత్తం మీద రెండు ప్రభుత్వాలు ఏర్పడి సరిగ్గా మూడేళ్ళైన సందర్భంగా భారీ భూకుంభకోణాలు ఒకేసారి బయటపడటంతో సిఎంలిద్దరూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios