ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న రామ్ గోపాల్ వర్మ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబు కుట్ర చేశారంటూ ఆరోపించిన లక్ష్మీ పార్వతి హాట్ టాపిక్ గా మారిన లక్ష్మీ పార్వతి కామెంట్స్

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై ఇప్పటికే వివాదం నడుస్తోంది. వర్మ.. ఆ సినిమాలో ఏమి చూపిస్తాడా అని ఇటు ప్రజలతోపాటు.. అటు రాజకీయ నేతల్లోనూ ఆసక్తి పెరిగింది. ఇలాంటి సమయంలో.. లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు.. మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

లక్ష్మీపార్వతి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..లెజెండరీ సినీనటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనను రెండో వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ మూడోసారి సీఎం అవ్వడం.. ఆ తర్వాత కొద్ది కాలానికే.. ఆయనను అధికారం నుంచి తొలగించడం వంటి అంశాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కన్నా ముందే తనకు మరో వ్యక్తితో వివాహం జరిగిందని.. ఒక కొడుకు పుట్టిన తర్వాత తాను తన భర్త నుంచి విడిపోయినట్లు ఆమె తెలిపారు. తనను ఎన్టీఆర్ వివాహం చేసుకోకుండా ఉండేందుకు చాలా మంది ప్రయత్నించారని, వాటిని పట్టించుకోకుండా ఎన్టీఆర్ గట్టిగా ప్రయత్నించడం వల్లే తమ వివాహం జరిగిందని ఆమె గుర్తు చేసుకున్నారు.

లక్ష్మీపార్వతి అడుగుపెట్టింది కాబట్టి.. ఇక టీడీపీ గెలవదని, ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవడం ప్రజలకు నచ్చలేదని.. ఇలా నానా రకాలుగా పుకార్లు పుట్టించారని ఆమె తెలిపారు. ఉదయం లేచి పేపర్ చూడాలంటే తనకు భయం వేసేదని చెప్పారు. ఎన్టీఆర్ అసలు పేపర్ చూసేవాడు కాదని.. తాను చూసి బాధపడుతుంటే.. పేపర్ చదవద్దని తనకు చెప్పేవారని ఆమె తెలిపారు.

తాము( ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి) పెళ్లి చేసుకోవడం వల్లే టీడీపీ ఓడిపోతుందనే ప్రచారానికి చంద్రబాబు తెర లేపాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు చేసిన కుట్రలను తాను ‘ తెలుగు తేజం’ అనే పుస్తకంలో వివరించానని స్పష్టం చేశారు. ఒక ప్రముఖ పత్రికాధిపతితో చేతులు కలిపి.. చంద్రబాబు సీఎం పదవిని ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. ఎన్టీఆర్ జీవితంలోకి తాను ప్రవేశించక ముందు నుంచే సీఎం పదవిని తీసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నాడని, ఈ మాట ఎన్టీఆర్ స్వయంగా చెప్పారని లక్ష్మీపార్వతి వివరించారు.

ఇదిలా ఉండగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా పేరుతో వర్మ మొదలుపెట్టిన వివాదానికి ఈ ఇంటర్వ్యూ తో లక్ష్మీ పార్వతి ఆజ్యం పోసారంటూ ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీ పార్వతి మాటలు.. బాంబుల్లా పేలి... చంద్రబాబు సీటుకి ఎసరుపెట్టడం కాయమని పలువురు భావిస్తున్నారు.