కేంద్ర మంత్రి, బిజెపి కర్ణాటక ఇంచార్జీ ప్రకాశ్ జవదేకర్ తనను కలిసినట్లు వచ్చిన వార్తలపై జెడిఎస్ నేత కుమారస్వామి తీవ్రంగా మండిపడ్డారు.
బెంగళూరు: కేంద్ర మంత్రి, బిజెపి కర్ణాటక ఇంచార్జీ ప్రకాశ్ జవదేకర్ తనను కలిసినట్లు వచ్చిన వార్తలపై జెడిఎస్ నేత కుమారస్వామి తీవ్రంగా మండిపడ్డారు. జవదేకర్ ను తాను కలుసుకున్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు.
బిజెపితో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు జరిగిన ప్రచారంపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. "జవదేకర్ ఎవరు. ఆ వ్యక్తి గురించి నాకు తెలియదు" అని అన్నారు.
తాను జవదేకర్ తో గానీ మరో బిజెపి నేతతో గానీ సమావేశం కాలేదని ఆయన స్పష్టం చేశారు. బిజెపి నేతలు ఎవరు కూడా తనను సంప్రదించలేదని చెప్పారు.
కర్ణాటక పిసిసి అధ్యక్షుడు జి. పరమేశ్వరతో కలిసి వెళ్లి, తాము మరోసారి గవర్నర్ వాజూభాయ్ వాలాను కలుస్తామని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతామని చెప్పారు.
ఇదిలావుంటే, కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు గవర్నర్ ను కలవనున్నారు. ప్రత్యేక బస్సుల్లో వారు రాజభవన్ కు వెళ్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించకపోతే రాజభవన్ ఎదుట ధర్నా చేయాలనే యోచనలో ఇరు పార్టీల నాయకులు ఉన్నారు.
