పుణె మ్యాచ్ లో సున్నా పరుగులకే అవుట్ అయిన కెప్టెన్

సమకాలీన క్రికెటర్లలో లెజెండ్ గా పేరొందిన టీం ఇండియా రథసారథి విరాట్ కోహ్లీ డకౌట్ అయి కూడా రికార్డు సృష్టించాడు.

ఇంగ్లాండ్ జట్టుపై డబుల్ సెంచరీ సాధించి వరుసగా నాలుగు టెస్ట్‌ సిరీస్‌ల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేసి కొత్త రికార్డును తన పేర లిఖించిన విషయం మరక ముందే ఈ రికార్డు కూడా ఆయన ఖాతాలో చేరింది.

ఇంతకీ విషయం ఏంటంటే ఈ రోజు పుణెలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. బ్యాట్స్ మెన్ లో డకౌట్ కావడం కామన్ కదా అని అనుకోవచ్చు. కానీ, కోహ్లీ డకౌట్ అయి కూడా తన పేరుతో రికార్డు కొట్టేశాడు. 

ఎందుకంటే 104 ఇన్నింగ్స్ తర్వాత ( టెస్టులు, వన్డేలు, ట్వంటీ20 లు కలుపుకొని) కోహ్లీ డకౌట్ అయ్యాడు. మూడేళ్ల కిందట 2014 లో ఇంగ్లాండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో డకౌట్ అయిన తర్వాత కోహ్లి సున్నా పరుగులకు వెనుదిరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు స్వదేశంలొో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అతను డకౌట్ అవడం కూడా ఇదే మొదటిసారి.