Asianet News TeluguAsianet News Telugu

కిర్లంపూడి పోలీసుల స్వాదీనం

  • పోలీసుల స్వాదీనంలో కిర్లంపూడి
  • కొత్త వాళెవరూ లోనికి రాలేరు,  గ్రామస్థులుబయటకు వెళ్ల లేరు
  • వూరంతా కెమెరాలు, పికెట్లు, సెక్షన్ 144, సెక్షన్ 30
  • వూర్లో, వూరి బయట మూడు వేల మంది పోలీసులు
kirlampudi encircled by andhra police

కిర్లంపూడి అనేది చిన్న గ్రామం, తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుంది, జనాభా అటుఇటుగా  9500 .  ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నా అక్కడికి వెళ్లడం కష్టం. వెళ్లినవాళ్లిపుడు బయటకు రావడం కష్టం. ఏ పని మీద వెళ్తున్నారు, కులమేమిటి,  ఎందుకు వెళ్తున్నారో, ఇపుడే ఎందుకు వెళ్తున్నారో, జేబులో, బ్యాగులో ఏమున్నాయి ..ఇలా అన్ని వివరాలు తీసుకున్నాక, ఆధార్ కార్డో, పాస్ పోర్టో చూపించి మీరు ఎలాంటి‘ ద్రోహ చింతన’తో వూర్లోకి వెళ్లడం లేదని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. మీరు చెప్పేవి సబబనిపిస్తే , వూర్లోకి వెళ్తారు. వెళ్లినా చాలా పికెట్లు దాటుకుంటూ వెళ్లాలి. మిమ్మల్ని పోలీసులు వెంటాడతారు.  మీకదలికలను సిసి కెమెరాలు రికార్డు చేస్తూ ఉంటాయి.మధ్యలో సబ్ ఇన్స్ పెక్టర్ వచ్చి మీకు క్లాస్ పీకడమనే ‘కౌన్సిలింగ్’ ఇచ్చి వూర్లో మీరు చేయకూడని పనులేవో చెబుతారు. కలువకూడని మనుషులెవరో చెబుతారు. దూరకూడని ఇళ్లేవో చెబుతారు. వూర్లో 144 సెక్షన్ విధించిన విషయం కూడా చెబుతారు. సెక్షన్ 30 జిల్లామొత్తం అమలులో ఉందని చెప్పి, ఎదైనా గుంపులో కనబడితే పట్టుకొచ్చి లోపలేస్తామని చెబుతారు. చివర్లో జూలై 26న  ముద్రగడ పద్మనాభమనే పెద్దమనిషి పాదయాత్ర చేయాలనుకంటున్నాడు, ఆయాత్రలో మీరు పాల్గొంటే మీభవిషత్తు నాశనమయవుతుందని చెబుతారు.

ఒక్క మాటలో చెబితే,  యుధ్ద పరిభాష వాడాల్సి వస్తుంది. కిర్లంపూడి అనే గ్రామాన్ని పోలీసుల స్వాదీనం చేసుకున్నారు. ఒక్క మనిషి, ఏ అధికారం లేని మనిషి, నినాదం తప్పమరొక ఆయుధం లేని వ్యక్తి 26వ తేదీన ఈ వూరి నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో పోలీసులు పెద్ద ఎత్తున దాడిచేసి ఈ వూరి స్వాదీనం చేసుకున్నారనాలి. ఆ వ్యక్తి అందరికి బాగా పరిచయమున్న ముద్రగడ పద్మనాభం,మాజీ మంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు కులస్థులకు ఇచ్చిన ఒక హామీని అమలుచేయాలని ఆయన రెండేళ్లుగా పోరాడుతున్నారు. ప్రభువుల వారు తన మొర ఆలకించాలని ఆయన జూలై 26న రాజధాని అమరావతికి పాదయాత్ర చేస్తానన్నారు. అంతే, పోలీసుల ఈ ప్రాంతం మీద పడ్డారు. గ్రౌండ్ జీరో కిర్లంపూడిని స్వాదీనం చేసుకున్నారు.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం,అనంతపురం తదితర జిల్లాలనుంచి దాదాపు మూడు వేల మంది పోలీసులను కిర్లంపూడికి తరలించారు. జూలై 26 నాటికి ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. గ్రామంలో అడుగడుగునా చెక్ పోస్టులు పెట్టారు. ఒక అధికారి అందించిన సమాచారం ప్రకారం కిర్లంపూడిలో ఆదివారం ఉదయానికి  20 మంది డిఎస్ పిలు,  50 మంది ఎస్ ఐలు, 24 మంది సిఐలు మకాం వేశారు. రాజుపాలెం, సింహాద్రి పురం అడ్డ రోడ్డు, చిల్లంగి, ఎస్సీపేట మొదలుకుని అన్ని వైపులా చెక్ పోస్టులు, పికెట్ లు ఏర్పాటుచేశారు.

ఇంతమంది పోలీసలు వూర్లోకి రావడం, వూరిని చుట్టుముట్టి ఉండటంతో కిర్లంపూడి వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఒక్క మనిషి యాత్ర చేపడితే, దానిని అపేందుకు ఇంత మంది పోలీసులెందుకో వారికి అర్థం కావడం లేదు.

కిర్లంపూడిలోకి  బయటి వారిని రానీయడం లేదు. కిర్లంపూడి వాసులయినా బయటకు పోతే తిరిగి రాలేరు.  ప్రతిసారి   గుర్తింపు కార్డులు చూపాల్సి వస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆధార్ గాని, మరొక ఐడి ప్రూఫ్ ఉన్నపుడే పనుల మీద గ్రామం దాటడం సాధ్యం.

ఇక, గ్రామంలో ఉన్న ముద్రగడ ఇంటికి వెళ్లడం ఇపుడు అసాధ్యం. పోలీసుల దృష్టంతా ఆయన ఇంటి మీదే. అక్కడి నుంచి ఉపద్రవం మొదలువుతుందని అనుమానం.అందుకే ఆ ఇంటి మీద  కూడా ఆంక్షలు మొదలయ్యాయి.మొదట్లో గుంపులుగా కాకుండా ఒక్కొక్కొరిని ఆయనను కలుసుకనేందుకు అనుమతించారు. శనివారం నుండి ఇది కూడా నిలిపివేశారు. ఇపుడు బంధువులను కూడా ముద్రగడ ఇంటికి అనుమతించడం లేదు.

పనుల మీద బయటికెళ్లిన వారు గ్రామంలోకి రావాలంటే పోలీసులడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.  ఇతర గ్రామాలలోని స్కూళ్లలో చదువుకునే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరి కదలికను గమనించేందుకు వూరంతా కెమెరాలు ఏర్పాటు చేశారు.

కిర్లంపూడి  ఆంధ్రలో భాగమా కాదా అని అనుమానం వచ్చేలా ఉందని కాపు జెఎసి నాయకులు అడుతున్నారు.

26 నుంచి ముద్రగడ పాదయాత్ర మొదలవుతుంది. అయితే, వారం ముందే కిర్లంపూడిని పోలీసుల స్వాదీనం చేసుకున్నారు.

ఇక వూరి బయట, కోనసీమ యావత్తు పోలీసుల అదుపులోకి వెళ్లింది. ఈ ప్రాంతంలో 95 పికెట్లు ఏర్పాటుచేశారు.  దాదాపు నాలుగువేల మంది పోలీసులను రంగంలోకి దించారని చెబుతన్నారు.  13 చెక్ పోస్టులను ఏర్పాటుచేశారు.అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. జగన్నపేట సెంటర్లో 40 మంది పోలీసుల భారీ పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసుల చోటామోటా నాయకులకు కూడా కౌన్సెలింగ్ పేరుతో ముద్రగడ యాత్రలో పాల్గొనవద్దని హెచ్చరిక చేస్తున్నారు.  కొందరు లీడర్లకు బైండోవర్ నోటీసులు పంపించారు. కాపు జెఎసి నేత తాతాజీ బైండోవర్ నోటీసు పంపితే ఆయన తిరస్కరించారు. నోటీసును పోలీసుల ఇంటికి అంటించి వెళ్లిపోయారు. కాపునేతలందరిని హౌస్ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. సెక్షన్ 30అమలులో ఉందని, 140 సెక్షన్ విధించామని , జనం గుంపులుగా ఉండరాదని పోలీసులు ప్రతివూర్లో చాటింపేస్తున్నారు. మొత్తం కొనసీమంతా ఖాకి గుడారంలాగా తయారయింది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios