Asianet News TeluguAsianet News Telugu

లాహిరి లాహిరి లాహిరీలో....

రాజస్థాన్, కేరళ భారత దేశంలో ఆహ్లాదకరమయిన హనీమూన్  ప్రాంతాలుగా ఎన్నికయ్యాయి

Kerala Rajasthan emerge best honeymoon destinations

కనుచూపు మేర వొయ్యారొలికించే పచ్చదనం, సుందరమయిన సరస్సులు, కొబ్బరి వనాలు,  పర్వతాలు..  

కేరళ దేశంలో బెస్ట్ హనీమూన్ ప్రదేశంగా ఎంపికయింది.  ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియా అండ్ సౌత్ ఇండియా పత్రిక పాఠకులు పంపిన అభిప్రాయలు సేకరించి, రాజస్థాన్ తో కలిపి కేరళను భారత దేశంలో ఆహ్లాదకరమయిన హనీమూన్  ప్రాంతాలుగా  ఎంపిక చేశారు.

 

కేరళ అందించే అనుభవాలే వేరు. చెక్కుచెదరని హరితావరణం, మంత్రముగ్థులను చేసే రమణీయ దృశ్యాలు, అక్కడ గ్రామీణ సంస్కృతి, కేరళను భారతీయ దేశానికే కాదు, ప్రపంచం నలుమూల నుంచి వచ్చే హనీమూనీకులకు ఆహ్లాదకరమయిన గమ్యస్థానం అయిందని కేరళ పర్యాటక శాఖ మంత్రి ఎ సి మోయిదీన్ అన్నారు. అయిదు నెలల పాటు సాగిన ఈ మ్యాగజైన్ డిజిటల్ పోల్ తర్వాత కేరళ, రాజస్థాన్లు కొత్త జంటలంతా కోరుకునే  కైపెక్కించే హానీమూన్ స్థలాలుగా ఎంపికయ్యాయి.

 

 ఈ పోటీకి  పేరుమోసిన టూరిజం సంస్థలు, హోటళ్ల పేర్లు కూడా వచ్చాయి. దాదాపు 50 రకాల స్పెషలైజేషన్లను పోటీకి పెట్టారు. అయినప్పటికీ ఈ  రెండురాష్ట్రాలు అగ్రభాగన నిలబడ్డాయి. ఈ డిజిటల్ పోల్ లో కొన్ని వేల మంది పాల్గొన్నారు.

 

కొత్త జంటలు మెచ్చే ప్రాంతంగా కేరళ ఎంపిక కావడం వెనక చాలా కృషి ఉంది. సుందరమయిన సముద్ర తీరం, మంచుకురిసే పడమటి కనుమల శిఖరాలు, గొలుసుల్లాగా సాగిపోయే ఉప్పు కయ్యలు, అక్కడి ప్రశాంత, తోపులాట లేని జీవన శైలి... కేరళ మంత్రశక్తి పాడవకుండా కాపాడడంలో ప్రభుత్వం విజయవంతమయిందని కేరళ మంత్రి చెప్పారు.

మిగతా అవార్డుల గెల్చుకున్న పర్యాటక గమ్యాలలో సింగపూర్ (బెస్ట్ కంట్రీ), హాంగ్ కాంగ్ ( బెస్ట్ సిటి), స్విజర్లాండ్ (బెస్ట్ ఫామిలీ డెస్టినేషన్ ) ఉన్నాయి. ఫ్రాన్స్, దక్షిణా ఫ్రికాలు అంతర్జాతీయ ఉత్తమ హనీమూన్ గమ్యస్థానాలుగా నిలబడ్డాయి.