భద్రాద్రి రామదాసు కీర్తనల్లో ప్రాచుర్చం పొందిన ‘ఎవడబ్బా సొమ్మని కులుకూతూ తిరిగేవు’ అన్న రీతిలో కెసిఆర్ ను పలువురు ప్రశ్నిస్తున్నారు.

అలంకార ప్రియుడైన తిరుమల వెంకటేశ్వురునికి మరికొన్ని విలువైన ఆభరణాలు సమకూరాయి. ఇప్పటి వరకూ ఎందరో ప్రముఖులు స్వామివారికి ఎంతో విలువైన ఆభరణాలను సమర్పించారు. అయితే, బుధవారం తెల్లవారుజామున తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సమర్పించిన ఆభరణాలు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే, ప్రత్యేక తెలంగాణా సాధిస్తే తిరుమలకు వచ్చి బంగారు ఆభరణాలను సమర్పించుకుంటానని మొక్కిన మొక్కు కదా. అందుకనే మొక్కు తీర్చుకునేందుకు కెసిఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు.

కెసిఆర్ సమర్పించిన కానుకల్లో రూ. 3.70 కోట్ల విలువైన 14.200 కిలోల స్వర్ణ సాలగ్రామహారం, రూ. 1.21 కోట్ల విలువైన 4.650 కిలోల ఐదు పేటల స్వర్ణకంఠాభరణం ఉంది. స్వామివారిని దర్శనమై సందర్భంగా ఇరు రాష్ట్రాలు సంతోషంతో ఉండాలని మొక్కకున్నట్లు కెసిఆర్ చెప్పారు. రూ. 5.59 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కెసిఆర్ సమర్పించుకున్నారు. కెసిఆర్ మొక్కు చెల్లించటంపై ఎలాగూ పెదవి విరుపులుంటాయి లేండి. ‘ఎవడబ్బా సొమ్మని మొక్కూలూ తీర్చేవు’ అంటూ ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు లేండి. ఎందుకంటే, మొక్కేమో కెసిఆర్ వ్యక్తిగతం. మొక్కు చెల్లించటానికి పెట్టిన ఖర్చేమో ప్రభుత్వంది. అందుకనే, భద్రాద్రి రామదాసు కీర్తనల్లో ప్రాచుర్చం పొందిన ‘ఎవడబ్బా సొమ్మని కులుకూతూ తిరిగేవు’ అన్న రీతిలో కెసిఆర్ ను పలువురు ప్రశ్నిస్తున్నారు.