తెలంగాణా పునర్నిర్మాణనికి  ‘అధికార చిరునామా’ దొరికింది కాబట్టి   ముఖ్యమంత్రి  కెసిఆర్ ఇపుడు మొక్కు తీర్చుకునేందుకు తిరుమల సందర్శిస్తారట.

వైభవంగా ముఖ్యమంత్రి ప్రాసాద ప్రవేశం పూర్తయినందున, తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు మరొక ముఖ్యమయిన మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అది తిరుమల శ్రీవారి దర్శనం.

ఇది చాలా కాలంగా పెండింగులో ఉంది. తెలంగాణా సిద్ధిస్తే ఏడుకొండలవాడిని సందర్శించి కాన్కలుచెల్లించుకుంటానని ఆయన మొక్కుకున్నారు. దీనికోసం తిరుమల వాసుడికి వజ్ర కిరీటం, తిరుచానూరు అమ్మవారికి బంగారు హారాన్ని సమర్పించాలనుకున్నారు. ఈ విషయాన్ని దేవస్థానం బోర్డు వారికి తెలియచేశారు. ఈ మేరకు ఈ రెండింటికయ్యే ఖర్చు కింద తెలంగాణా ప్రభుత్వం టిటిడికి రు. 5 కోట్లు కూడా చెల్లించింది. ఈ నగలను కూడా కొయంబత్తూరు కు చెందిన కళాకారుల తో టిటిడి తయారుచేయింది. ఇవన్నీ స్వామి వారిని అలంకరించేందుకు సిద్ధంగా ఉన్నాయట.

అయితే, సరయిన ముహూర్తం దొరకక ఆయన తిరుపతి యాత్ర ఖరారు కాలేదు. ఇపుడు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమయిన ఘట్టం , తెలంగాణా ముఖ్యమంత్రి నివాస ప్రాంగణ నిర్మాణం, పూర్తయినందున ఆయన ఇక తిరుపతి యాత్ర గురించి ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. బహుశా డిసెంబర్ లోనే ఆయన తిరుపతి వెళ్లి వస్తారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

రాజాప్రాసాదం లేదా కోట అనేది రాజ్య సంస్థాపనలో చాలా ముఖ్యమయిన ఘట్టం. పురాతన కాలంలో నే కాదు అధునిక కాలంలో కూడా పాలనాధీశుడికి లేదా ఇపుడు రాజకీయ అధికారంలో ఉన్న వ్యక్తి కి కోటలను, లేదా రాజ్యంలోనే విశిష్టమయిన ప్రాసాదాన్ని నిర్మించడం అనావాయితి. అవి కేవల నివాసమే కాదు, శత్రువులను, సాధారణ ప్రజలను జడిపించేాలా భారీగా నిండు భద్రతతో ఉంటాయి. అందుకే పూర్వం రాజులు భారీ కోటలు నిర్మించుకుంటే, బ్రిటిష్ వారు వైస్రాయ్ కోసం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ను భారీగానే కాదు, ఎత్తయిన కొండమీద నిర్మించారు. నిజాం హైదరాబాద్ లో నిర్మించకున్న భవనాలు, నిజాం కోసం ఢిల్లీలో నిర్మించిన ఇచ్చిన హైదరాబాద్ హౌస్ లు, రాజస్థాన్ కోటలు ఇాలాంటి ఎదురులేని అధికారానికి చిహ్నాలు.

తెలంగాణా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నిర్మాణంతో తెలంగాణా కొక ‘అధికార చిరునామా’ దొరికింది కాబట్టి ముఖ్యమంత్రి ఇపుడు మొక్కు తీర్చుకునేందుకు తిరుమల సందర్శిస్తారని వినబడుతూ ఉంది.