ఆందోళనకారులను అణిచివేస్తే ఉద్యమాలు ఆగిపోతాయని ప్రభుత్వాలనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరోటి లేదన్న విషయం పాలకులు గ్రహించటం మంచిది.
ఇద్దరి పాలనాలోనూ ఎవరికైనా తేడాలు కనబడుతున్నాయా? పరిపాలనలో చంద్రబాబునాయుడైనా, కెసిఆర్ అయినా ఒకే విధమైన ఆలోచనా విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమ ప్రభుత్వంపైన, తమ పాలనపైన ఎక్కడా వ్యతిరేకత కనబడకూడదు, వినబడకూడదు. సింగిల్ పాయింట్ అజెండాతోనే ముందుకుపోతున్నారు ఇద్దరు సిఎంలు. అవసరమైతే ప్రజాస్వామ్యానికి పాతరైనా వేయాలి కానీ ఎవరినీ గొంతెత్తనీయకూడదన్నది వీరిద్దరి ధ్యేయం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నది ఒకటే. సమస్యలను ప్రస్తావిస్తూ ఎవరు కూడా ఆందోళన బాట పట్టకూడదు. రాష్ట్రంలో అంతా బ్రహ్మాండమన్నట్లే కనబడాలి, వినబడాలి. ఆఖరకు మీడియాకూడా భజన చేయాల్సిందే.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇద్దరు కూడా అప్పటి ప్రభుత్వాలపై ఎన్నా ఆందోళనలు నిర్వహించారు. ఎందరినో తమ అవసరాలకోసం రెచ్చగొట్టారు. అప్పట్లో అదంతా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగిన ఆందోళన. కాలం కలిసి వచ్చి అధికారంలోకి రాగానే నాడు అనుసరించిన విధనాలనే ఇపుడు మరొకరు అవలంభిస్తుంటే సహించలేకపోతున్నారు. ఏపిలో జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలకు తెలంగాణాలో ప్రతిపక్షాలైనా, జెఎసి విషయంలోనైనా కెసిఆర్ అనుసరిస్తున్న విధానమొకటే.
న్యాయంకోసం గొంతెత్తుతున్న, ఆందోళనలు చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమాల్లో నమోదైన కేసులను పోలీసులు చూపించి కోదండరామ్ నిర్వాహించాలనుకున్న ర్యాలికి అనుమతి నిరాకరించారు. పైగా కోదండరామ్ కు హింసను ప్రేరేపిస్తున్నారంటూ పోలీసులు చెప్పటం గమనార్హం. ఏపిలో మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు హాజరవ్వటానికి వచ్చిన రోజా విషయంలో కూడా పోలీసులు అవే కారణాలు చెప్పారు. సదస్సును భగ్నం చేయటానికే వచ్చిందని చెప్పి పోలీసులు రోజాను అరెస్టు చేసారు. ఆందోళనకారులను అణిచివేస్తే ఉద్యమాలు ఆగిపోతాయని ప్రభుత్వాలనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరోటి లేదన్న విషయం పాలకులు గ్రహించటం మంచిది.
