బెంగళూరు: బిజెపి కాస్తా పుంజుకుంటోంది. బిజెపి 18 స్థానాల్లో, కాంగ్రెసు 24 స్థానాల్లో, జెడిఎస్ 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తొలి ఫలితాలు కాంగ్రెసుకు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెసు ముందంజలో ఉంది. కాంగ్రెసు 17 స్థానాల్లో, బిజెపి 4 స్థానాల్లో, జెడిఎస్ 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

రామనగర నియోజకవర్గంలో జెడిఎస్ నేత కుమారస్వామి ముందంజలో ఉన్నారు. తాను ఓడిపోతున్న విషయాన్ని యోగీశ్వర అంగీకరించారు. కాంగ్రెసు కుమారస్వామిని గెలిపిస్తోందని అన్నారు. 

కర్ణాటక శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 38 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపులో 11 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు 100 మీటర్ల మేర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఉదయం 9 గంటల కల్లా ధోరణలు తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై స్పష్టత రానుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీల జాతకాలు కాసేపట్లో తేలనున్ాయి. హంగ్ అసెంబ్లీ వస్తుందని ఎగ్జెట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.  ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తున్నారు.

రాష్ట్రంలోని పలు సీట్లలో బిజెపి, కాంగ్రెసు, జెడిఎస్ ల మధ్య ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ మొత్తం స్థానాలు 224 కాగా, 222 సీట్లకు ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరిగింది. ఏదో ఒకటి పార్టీ మ్యాజిక్ ఫిగర్ అందుకోగలిగితే సమస్య లేదు. కానీ హంగ్ వస్తే మాత్రం పార్టీల మధ్య సంప్రదింపులకు తెర లేస్తుంది.

కాగా, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చాయి. బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని కొన్ని సర్వేలు, కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని మరి కొన్ని సర్వేలు చెప్పాయి. మూడో స్థానంలో జెడిఎస్ నిలుస్తుందనే విషయంలో మాత్రం సర్వేలన్నింటీలో ఏకసూత్రత కనిపిస్తుంది. ఆ రకంగా జెడిఎస్ కింగ్ మేకర్ గా అవతరించే అవకాశం ుంది. 

కాంగ్రెసు మెజారిటీ సాధిస్తే 1985 నుంచి అధికారాన్ని రెండోసారి నిలబెట్టుకోలగడం రెండవసారి అవుతుంది. కాంగ్రెసు మెజారిటీ సాధిస్తే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని తిరిగి చేపడుతారు. లేని పక్షంలో జెడిఎస్ పొత్తు కుదుర్చుకోవడానికి జరిగే సంప్రదింపుల్లో ముఖ్యమంత్రి పదవికి వేరే నేతను ఎంపిక చేయవచ్చు..

అధిష్టానం కోరితే దళిత నేతకు అవకాశం కల్పించి తాను పక్కకు జరుగుతానని సిద్ధరామయ్య చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరు కూడా ముందుకు వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 112 సీట్లు రాకపోతే కాంగ్రెసు చిన్నపార్టీలను, ఇండిపెండెంట్లను కూడా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేయవచ్చు.

బిజెపికి మెజారిటీ వస్తే యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడం ఖాయం. అలా జరిగితే వచ్చే లోకసభ ఎన్నికల్లో బిజెపికి ఊపు వస్తుంది. మెజారిటీ రాకపోతే కాంగ్రెసు చేసే పనే బిజెపి కూడా చేయాల్సి వస్తుంది. అటువంటి స్థితిలో ముఖ్యమంత్రి పదవి మరొకరిని వరించవచ్చు కూడా. కేంద్ర మంత్రి అనంతకుమార్ పేరు ఇప్పటికే చర్చలోకి వచ్చింది.