కర్ణాటకలో కాంగ్రెసు, జెడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. 

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెసు, జెడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. తొలుత బయటి నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన కాంగ్రెసు ఇప్పుడు ప్రభుత్వంలో చేరడానికి సిద్ధపడింది. 

విధిగా ప్రభుత్వంలో చేరాలని జెడిఎస్ అధినేత దేవెగౌడ కాంగ్రెసుకు షరతు పెట్టారు. అంతేకాకుండా డిప్యూటీ సిఎం పదవితో పాటు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. జెడిఎస్ నుంచి 14 మంది మంత్రులుంటారు. 

ఈ రెండు పార్టీలకు కలిపి ప్రస్తుతం 116 మంది శాసనసభ్యులున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస ఆధిక్యత 112 సీట్లు. జెడిఎస్ కు మద్తతు ఇస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ప్రకటించారు. 

మంగళవారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెసు, జెడిఎస్ నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లోనూ కాంగ్రెసు, జెడిఎస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇదిలావుంటే, కర్ణాటక ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్వహించ తలపెట్టిన మీడియా సమావేశం రద్దయినట్లు తెలుస్తోంది. ప్రజల తీర్పు శిరోధార్యమని సిద్ధరామయ్య అన్నారు. 

పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుతానని బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప అన్నారు. కాంగ్రెసు, జెడిఎస్ చర్చల గురించి తనకు అనవసరమని ఆయన అన్నారు.