బెంగళూరు: జెడిఎస్ ను తమ వైపు తిప్పుకోవడానికి బిజెపి పెద్దలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బుధవారం ఉదయం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ జెడిఎస్ నేత కుమారస్వామిని కలిసి పొత్తుకు ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

అయితే, అందుకు కుమారస్వామి నిరాకరించారు. తాము బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసుతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు 

ఇదిలావుంటే, యడ్యూరప్పతో పాటు బిజెపి పెద్దలు గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిశారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. 

కాంగ్రెసు శాసనసభా పక్ష సమావేశం కొనసాగుతోంది. కాసేపట్లో జెడిఎస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.  కాంగ్రెసు పెద్దలకు అందబాటులో లేని ఆనంద్ సింగ్, నాగేంద్ర బిజెపి నేత బి. శ్రీరాములుకు సన్నిహితులని తెలుస్తోంది. 

మెజారిటీ కోసం కాంగ్రెసు ఎనిమిది శాసనసభ్యుల మద్దతు అవసరమవుతుంది. ఆ మద్దతు కోసం బిజెపి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ స్థితిలో జోరుగా క్యాంప్ రాజకీయాలు సాగుతున్నాయి.