యెడ్డీ బలపరీక్ష టెన్షన్: మోహరిస్తున్న ఇరు వర్గాలు

First Published 19, May 2018, 10:46 AM IST
Karnataka floor test: Cong-JD(S) MLAs arrive in Bengaluru
Highlights

ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కునే నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బెంగళూరు: ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కునే నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరిణామాలు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఈ స్థితిలో హైదరాబాదు నుంచి కాంగ్రెసు, జెడిఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకున్నారు. 

వారు హిల్టన్ హోటల్ నుంచి విధానసౌధకు కూడా చేరుకున్నారు. కాంగ్రెసు శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య కూడా విధానసౌధకు వచ్చారు. యడ్యూరప్ప బలపరీక్ష నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విధాన సౌధలో 200 మంది మార్షల్స్ ను నియోగించారు. 

తమ పార్టీ సభ్యుడు ఆనంద్ సింగ్ తమ వద్ద లేని మాట నిజమేనని, కానీ ఆయన తమ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని, విధానసౌధకు వస్తారని, తప్పకుండా తమకు అనుకూలంగా ఓటు వేస్తారని రామలింగా రెడ్డి అన్నారు.

ప్రెటమ్ స్పీకర్ బోపయ్య కూడా విధాన సౌధకు చేరుకున్నారు కెజి బోపయ్య నియామకంపై ప్రతిపక్షాలు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో త్వరలో విచారణ ప్రారంభం కానుంది. ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెసు, జెడిఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన వివాదాస్పద వ్యవహారశైలిని ఆ పార్టీలు తమ పిటిషన్ లో ప్రస్తావించాయి. 

తమకు సంఖ్యాబలం ఉందని, బిజెపికి లేదని కాంగ్రెసు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. కర్ణాటకలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొనడానికి బిజెపి సభ్యులు సాంగ్రీ-లా హోటల్ కు చేరుకున్నారు. యడ్యూరప్ప కూడా అక్కడికి వచ్చారు. వందశాతం తాను బలపరీక్షలో నెగ్గుతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

loader