బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి బిజెపి నేత యడ్యూరప్ప దూకుడుగా వెళ్తున్నారు. కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యుల్లో కొంత మందిని తనవైపు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐదుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఆయనతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

బిజెపి శాసనసభా పక్ష నేత యడ్యూరప్పను ఆ పార్టీ శాసనసభ్యులు ఎన్నుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ లో పరేడ్ చేయిస్తారని అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్ వాజుభాయ్ వాలాను కోరనున్నారు.

రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయడానికి జెపి నడ్డా, ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జవదేకర్ జెడిఎస్ నేత కుమారస్వామిని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి

తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి జెడిఎస్, కాంగ్రెసు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఓ హోటల్లో ఎమ్మెల్యేలతో జెడిఎస్ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. ఎన్నికైన శాసనసభ్యులతో కాంగ్రెసు దూతలు సమావేశమవుతున్నారు. సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 

వారు అధిష్టానానికి అందుబాటులో లేరని తెలుస్తోంది. పాటిల్, ఆనంద్ సింగ్, నాగేంద్రలుగా వారిని గుర్తించారు. కొంత మంది ఎమ్మెల్యేలను కాంగ్రెసు నేతలు హైదరాబాదు తరలించినట్లు తెలుస్తోంది.

గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, మధుయాష్కీ, వేణుగోపాల్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. మల్లికార్జున్ ఖర్గే కూడా సమావేశానికి వచ్చారు. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెసు దూతలు పంజాబ్ రిసార్ట్ కు తరలిస్తున్నారు. బిజెపి అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆజాద్ విమర్శించారు.