ప్రధాని నరేంద్రమోదీకి.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. కర్ణాటక ఎన్నికల వేల.. మోదీకి ధీటుగా సమాధానం చెబుతూనే.. బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. 

తాను చూసిన చాలామంది భారతీయులకంటే... తన తల్లి సోనియా గాంధీ గొప్పదని కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్న నేపథ్యంలో.. రాహుల్ బెంగళూరులో మీడియానుద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రత్యేకించి తనపైనా, తల్లి సోనియాపైనా ‘‘వ్యక్తిగత విమర్శలు’’ సంధించడంపై ఆయన స్పందిస్తూ...
 
‘‘నా తల్లి ఇటలీ దేశస్తురాలు. ఆమె తన జీవితంలో అధికభాగం భారత్‌లోనే గడిపారు. భారతీయులమని చెప్పుకునే చాలామంది కంటే... ఈ దేశస్తురాలినని చెప్పుకునేందుకు ఆమెకు మరింత అర్హత ఉంది. ఈ దేశం కోసం ఆమె త్యాగం చేశారు. ఈ దేశం కోసం ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు...’’ అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్థాయి ఏమిటో ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయనీ... అలా మాట్లాడడం ఆయనకు ఇష్టమైతే అది ఆయన విజ్ఞతకే వదిలేయాలన్నారు.