ఆమె పోటీలోకి దిగితే.. గెలుపు గ్యారెంటీ అంటున్న జేడీఎస్ నేతలు

కర్ణాటక కాబోయే సీఎం కుమారస్వామి భార్య.. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది. కుమారస్వామి మొదటి భార్య అనిత కుమారస్వామి రామనగర శాసనసభ నియోజకవర్గంనుంచి పోటీ చేయనున్నారు. అదేంటీ.. మొన్ననే కదా కర్ణాటక ఎన్నికలు జరిగింది.. మళ్లీ అప్పుడే ఎన్నికలు ఏంటి..? కుమార స్వామి భార్య పోటీ చేయడం ఏంటి అనుకుంటున్నారా..?

మీరు చదివింది నిజమే.. ఆమె నిజంగానే ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా హెచ్.డి. కుమారస్వామి రెండు శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేశారు.ఒకటి రామనగర నియోజకవర్గం కాగా.. మరోకటి చెన్నపట్టణ నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కుమార స్వామి విజయం సాధించారు.

ఇప్పుడు ఈ రెండింటిలో రామనగర నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ నియోజకవర్గం నుంచి తన భార్య అనిత కుమారస్వామిని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆవిడైతేనే ఆ నియోజకవర్గంలో గెలుపు ఖాయమని జేడీఎస్ నేతలు భావిస్తున్నారు.