కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప భవిష్యత్తు శుక్రవారం సుప్రీంకోర్టులో తేలనున్నది.

న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప భవిష్యత్తు శుక్రవారం సుప్రీంకోర్టులో తేలనున్నది. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు శుక్రవారం వాదనలు జరగనున్నాయి. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజుభాయ్ వాలా ఆహ్వానించడాన్ని కాంగ్రెసు పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

గవర్నర్ కు యడ్యూరప్ప సమర్పించిన లేఖలను అడ్వొకేట్ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీంకోర్టు ముందు ఉంచనున్నారు. ఈ లేఖలే కేసులో కీలకమవుతాయని భావిస్తున్నారు. తనకున్న ఎమ్మెల్యేల మద్దతుపై యడ్యూరప్ప గవర్నర్ కు ఇచ్చిన లేఖలో ఎలా చూపారనే విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలించనున్నది. 

కేంద్ర ప్రభుత్వం తరఫున కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించనున్నారు. కాంగ్రెసు, జెడిఎస్ ల తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తారు. కర్ణాటక పిసిసి అధ్యక్షుడు పరమేశ్వర అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. 

ఇదిలావుంటే, కాంగ్రెసు నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని కాంగ్రెసు ప్రతినిధి బృందం రాష్ట్రపతి కోవింద్ ను కలిసి కర్ణాటక వ్యవహారాలపై ఫిర్యాదు చేయనుంది. తమకు పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలతో బిజెపి బేరసారాలకు దిగిందని ఆజాద్ విమర్శిస్తున్నారు.