బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 224 సీట్లకు గాను 222 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. నకిలీ ఓటరు ఐడి కార్డులు పట్టుబడిన నేపథ్యంలో రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గం పోలింగ్ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది. ఓ అభ్యర్థి మరణించడంతో జయనగర్ ఎన్నికల వాయిదా పడింది.

కాంగ్రెసు, బిజెపి, జెడిఎస్ పార్టీలు హోరాహోరీ ప్రచారం సాగించాయి. కాంగ్రెసు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నించగా, బిజెపి తిరిగి పాగా వేయాలని చూసింది. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ రాదని ప్రీ పోల్ సర్వేలు తేల్చిన నేపథ్యంలో ఫలితాలపై ఉత్సుకత నెలకొంది. దేవెగౌడ నేతృత్వంలోని జెడిఎస్ కింగ్ మేకర్ గా అవతరిస్తుందని భావిస్తున్నారు.

రాష్ట్రంలో 4.96 కోట్ల మంది ఓటర్లు ున్నారు. 222 స్థానాల్లో 2600 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. పురుష ఓటర్లు 2.52 మంది కాగా, మహిళా ఓటర్లు 2.44 మంది ఉన్నారు. 4,552 మంది ట్రాన్స్ జెండర్స్. 

మొత్తం 55,600 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు 3.5 లక్ష మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూల పరిస్థితిని తెలుసుకునేందుకు యాప్ ను ఏర్పాటు చేశారు.