భార్యపై గృహహింస చట్టం ప్రయోగించిన భర్త

First Published 28, Dec 2017, 12:51 PM IST
karimnagar Husband file a case to his wife on domestic abuse act
Highlights
  • భార్య పై గృహహింస చట్టం కింద కోర్టును ఆశ్రయించిన భర్త
  • భార్య నుంచి తనకు నష్టపరిహారం అందేలా చూడాలని కోర్టును కోరిన భర్త
  • భార్యకు నోటీసులు జారీ చేసిన కరీంనగర్ కోర్టు
  •  

గృహ హింస కేసు అనగానే బార్యను భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అనుకుంటాం. అలా కాకుంటే అత్తామామలో, ఆడపడుచులో హింసించడం చూసుంటాం. అంటే ఇప్పటివరకు మహిళలే ఈ గృహహింస కేసుల్లో బాధితులుగా ఉండటం చూసుంటాం. కానీ దీనికి వ్యతిరేకంగా ఓ భర్త తన భార్య, అత్తమామలు తనను చిత్ర హింసలు పెడుతున్నారని, వారిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేయాలని కోర్టు ను ఆశ్రయించాడు. 

వివరాల్లోకి వెళితే కరీంనగర్‌లోని హుస్సేనిపురకు చెందిన అబ్దుల్ మన్నాన్, కాన్‌పురకు చెందిన ఫాతిమా 2016 లో ప్రేమించి పెండ్లి చేసుకున్నారు.  అయితే  ఫాతిమ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ జంట హైదరాబాద్ కు మకాం మార్చారు. హైదరాబాద్ లో ఉంటూ మన్నాన్ మలేషియాకు వెళ్లి ఉద్యోగాన్ని చేయాలని భావించాడు. అయితే ఆ ప్రయత్నం విఫలమవడంతో మళ్లీ కరీంనగర్ కు వెళ్లి అక్కడ కాపురం పెట్టారు. ఈ క్రమంలో ఫాతిమ మళ్లీ వారి తల్లిదండ్రులకు దగ్గరయ్యింది. ఇలా ఓ రోజు తండ్రి వచ్చి ఆమెను వారి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటినుంచి ఫాతిమ తిరిగి మన్నాన్ దగ్గరకు రాలేదు. దీంతో కొన్ని రోజుల తర్వాత అతడు తన భార్యను తీసుకురావడానికి వెళితే ఆమె కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఫాతిమా పైచదువులు చదువుకుంటున్నదని, ఆమెకు విడాకులు ఇవ్వాలని వారు బెదిరించారని మన్నాన్ కోర్టుకు విన్నవించాడు. అంతే కాకుండా తనపై వరకట్న వేధింపుల కేసు పెట్టి అరెస్ట్ చేయించారని వివరించాడు.

తనకు అత్తింటివారి నుంచి ప్రమాదం పొంచి ఉందని రక్షణ కల్పించాలని న్యాయమూర్తికి వేడుకున్నాడు. తన పై అక్రమ కేసులు పెట్టి తన పరువు తీయడమే కాకుండా మానసిక హింసకు గురిచేసినందుకు భార్య ఫాతిమా, ఆమె కుటుంబసభ్యుల నుంచి రూ.20 లక్షల నష్ట పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరాడు. భార్య తన వద్దకు వచ్చేలా చూడాలని విన్నవించాడు. దీంతో కరీంనగర్ కోర్టు ఫాతిమా, ఆమె కుటుంబసభ్యులకు నోటీసులు జారీచేశారు.
 

loader