ముద్రగడ చేపట్టిన ‘చలో అమరావతి‘ కాపు యాత్ర అణచేసినందుకు ‘చలో కిర్లంపూడి’ తో ముఖ్యమంత్రి చంద్రబాబుకు జవాబు చెప్పాలని కాపులు నిర్ణయించారు
కాపులు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. రివర్స్ లోవెళ్లి చంద్రబాబు ప్రభుత్వంతో ఢీ కొనాలనుకుంటున్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ‘చలో అమరావతి‘ కాపు యాత్రకు అనుమతి నిరాకరించినందుకు జవాబుగా ‘చలో కిర్లంపూడి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు కాపు జెఎసి నిర్ణయం తీసుకుంది.చలో అమరావతి అంటూ ముద్రగడ నినదిస్తుంటే ‘చలో కిర్లంపూడి’ అంటూ కాపులు కిర్లంపూడికి కదలి వస్తారు.
రెండురోజులుగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి ఇతర జిల్లాల నుంచి కాపులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాపు జన జనసందడితో కిర్లంపూడి కిటకిటలాడుతోంది. గతనెల 26వ తేదీన తలపెట్టిన ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి ప్రతిరోజూ పాదయాత్రకు మొదలుపెట్టడం, పోలీసులు అడ్డుచెప్పడం మామూలయిపోయింది.
గత రెండురోజులుగా ముద్రగడ తన ఇంటి గేటు వద్దే కుర్చీలో కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన తెలియజేస్తున్నారు.దీనితో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ముద్రగడకు సంఘీభావం తెలియజేసే వారి సంఖ్య ఎక్కువయింది. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, కొవ్వూరు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. . గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణలు ముద్రగడను కలిసి సంఘీభావం తెలియజేశారు. వారితోపాటు తోట రామకృష్ణ, దొడ్డి పార్థసారధి, బండి పట్ట్భారామ్, సుంకర వెంకటరెడ్డి, భారీ సంఖ్యలో కాపు యువత, కాపు సంఘాలు ముద్రగడను కలిశారు.
ఇప్పటిదాకా,ముద్రగడ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఆయనను కలిసేందుకు వచ్చినవారికి పెద్దగా ఆటంకాలు కలిగించలేదు. కాపు జెఎసి నాయకులు కూడా తమదైన రీతిలో రోజుకోవిధంగా నిరసన తెలియజేస్తున్నారువివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్న వారినుద్దేశించి ముద్రగడ మాట్లాడుతున్నారు. కాపులను బిసిల్లో చేర్చేవరకు తన పోరాటం ఆగదని ఆయన స్పష్టంచేస్తున్నారు. తన పాదయాత్రకు ఆటంకం కలిగించే ధోరణిని కొనసాగిస్తే తాను వేరే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని ముద్రగడ స్పష్టంచేశారు.
