కలకాలం కలిసుండాల్సిన భర్తలను భార్యలు కడతేర్చుతున్న సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయి. గత కొంత కాలంగా ఇలాంటి వార్తలు మరీ ఎక్కువగా వినబడుతున్నాయి. కారణాలు ఏవైతేనేం అంతిమంగా భర్తల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అలాంటి సంఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే...చత్తీస్ ఘడ్ కు చెందిన కోర్స దేవయ్య(22) అనే యువకుడు తన భార్య లక్ష్మీతో కలిసి ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రానికి వలసవచ్చాడు.   వీరు కొత్తగూడెం జిల్లా అశ్వాపురం సమీపంలోని కారేపల్లి గ్రామంలో నివాసముంటున్నారు. అయితే  బాగా మందు తాగే అలవాటున్న దేవయ్య రోజూ తాగొచ్చి భార్యను అకారణంగా కొట్టేవాడు.  ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఫుల్లుగా మందు తాగిన దేవయ్య ఎప్పటిలాగే భార్యను చితకబాదాడు.  దీంతో ఆమె తన తండ్రికి ఈ విషయాన్ని తెలిపింది. దీంతో అల్లుడిని మందలించడానికి లక్ష్మి తండ్రి ప్రయత్నించాడు. ఈ క్రమంలో వీరి మద్య మాటా మాటా పెరగడంతొ భార్య, మామ కలిసి దేవయ్యను కర్రతో  తలపై కొట్టారు. ఈ దాడిలో అతడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్యకు కారకులైన లక్ష్మిని, ఆమె తండ్రిని అరెస్ట్ చేశారు.