అధికార పార్టీ నేతలు.. ప్రజా ధనాన్ని ఏవిధంగా వృధా చేస్తున్నారో తెలియజేసేందుకు ఇదో ఉదాహరణ. టీడీపీ నేత కంభంపాటి హరిబాబు.. కేవలం విమాన ఖర్చుల కోసం రూ.70లక్షలు ఖర్చు చేశారు. మొన్నటి వరకు ఆయన ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఢిల్లీ నుంచి ఏపీకి రావడానికి కేవలం ఒక సంవత్సరంలో ఆయన చేసిన ఖర్చు రూ.73లక్షలు. ఆయన టీఏ( ట్రావెల్ అలవెన్స్) బిల్లు చూసి.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు కూడా షాక్ అయ్యారు.

ఎంత అమరావతి నుంచి ఢిల్లీకి ఏడాదిపాటు తిరిగితే మాత్రం ఇంత ఖర్చు అవుతుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోజూ ప్రయాణించినా కూడా ఇంత ఖర్చు అవ్వదని కొందరు బాహాటంగానే చెప్పడం గమనార్హం. ఒకవైపు రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీగా ఉందని చెబుతూనే.. అధికార పార్టీ నేతలు అనవసరపు వాటికి ఇలా రూ.లక్షలు ఖర్చు చేయడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం విమాన ఖర్చులకే కంభంపాటి ఇంత ఖర్చు చేశారంటే.. ఇతర ఖర్చులకు ఇంకెంత ప్రజా ధనాన్ని వృధా చేసారో అనే అనుమానులు కలుగుతున్నాయి. ఇటీవలే కంభంపాటి పదవీకాలం ముగిసింది. మళ్లీ ఆ పదవిని సంపాదించుకునేందుకు చాలానే ప్రయత్నించారు కానీ.. ఎందుకో సఫలంకాలేదు.