జయ మృతిపై కమల్, కేజ్రీవాల్ వివాదాస్పద కామెంట్లు నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన విమర్శలు
వెండితెరపై, ఆ పై ద్రవిడనాట చెరగని ముద్రవేసి వెళ్లిపోయిన ‘అమ్మ’ పై ఇద్దరు ప్రముఖులు చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్ లో వివాదాస్పదంగా మారాయి.వారి ట్వీట్లను నెటిజన్లు సరిగ్గా అర్థం చేసుకోలేదా.. లేక కావాలనే వారు అమ్మ గురించి అలా రాశారా అనేది తెలియదు.
జయలలిత మృతితో యావత్తు తమిళనాడు రోదిస్తుంటే విలక్షణ నటుడు కమల్ హసన్ అమ్మ మృతిపై ట్వీటర్ లో చేసిన కామెంట్ అతడి అభిమానులకే నచ్చడం లేదు.
'జయలలితపై ఆధారపడిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి' అంటూ కమల్ ట్వీట్ చేశారు. తమిళనాడు శోకసంద్రంలో మునిగివున్న తరుణంలో కమల్ ఈ ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
చనిపోయిన వ్యక్తుల పట్ల కనీస మర్యాద పాటించకుండా కమల్ ట్వీట్ చేశారని, ఆయన షాడిస్ట్ లక్షణాన్ని ఇది చాటుతుందని నెటిజన్లు ధ్వజమెత్తారు.
ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి , అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలానే ట్వీట్ చేసి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.
అమ్మ మృతికి ట్విటర్లో నివాళి అర్పిస్తున్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్ ‘ అమ్మ అమ్ ఆద్మీ మనిషి అంటూ కామెంట్ చేశారు. దీంతో కేజ్రీవాల్ అమ్మ మృతిని కూడా తన పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారని నెటిజన్లు మండిపడ్డారు.
