కఫాలా అంటే ఒక రకంగా ఆధునిక బానిసత్వమే.

ఖతార్ దేశంలో ‘కఫాలా’ రద్దుతో తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది కార్మికులు స్వేచ్చా వాయువులు పీల్చుకోబోతున్నారు. కఫాలా అంటే ఒక రకంగా ఆధునిక బానిసత్వమే. గల్ఫ్ దేశాల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఖతార్ బుధవారం నుండి కఫాలాను రద్దు చేస్తు ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఉత్తర్వులు మంగళవారం నుండే అమల్లోకి వస్తాయి.

ఇకపై తమ దేశంలో పనిచేస్తున్న విదేశీ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా పరిగణిస్తామని ఖతార్ కార్మికశాఖ మంత్రి ఇసాబిన్ సాద్ అల్ జఫాలీ ప్రకటించటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశం తీసుకున్న నిర్ణయంతో ఖతార్ పనిచేస్తున్న 21 లక్షల మంది విదేశీయులకు ఎంతో ఉపయోగం జరుగనున్నది.

ప్రస్తుతం కఫాలా వ్యవస్ధ ఖతర్ తో పాటు సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, బహ్రైన్ దేశాల్లో అమలులో ఉంది. కఫాలా ప్రకారం పై దేశాల్లో ఉద్యోగం సంపాదించాలంటే ఎవరో ఒకరు స్పాన్సర్ షిప్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్పాన్సర్ షిప్ లెటర్ నే కఫాల అంటారు.

అభ్యర్ధిని నియమించుకునే సమయంలో యజమాని ఇచ్చే ధృవీకరణ పత్రంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది వుంటేనే పై దేశాల్లో పనిచేయటానికి ఆయా దేశాలు వీసా మంజూరు చేస్తాయి.

కఫాలా ద్వారా వీసా అందుకని పై దేశాల్లో ఉద్యోగంలో చేరిన వారు వారి వీసాలను తమ యజమానికి అప్పగించాలి. ఒకసారి వీసాలు వారి యజమానుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఇక వారివి ఒక విధంగా బానిస బ్రతుకులే. ఎందుకంటే, వారి ఇష్టప్రకారం ఉద్యోగం మారేందుకు లేదు. ఒక వేళ వారు గనుక ఉద్యోగం మానేసినా, మారే ప్రయత్నంచేసినా వారికి జైలుశిక్ష, జరిమానాలే గతి.

ఇటువంటి కఠినమైన చట్టం వల్ల దశాబ్దాలుగా ఖతార్ లోని విదేశీ కార్మికుల బ్రతుకులు దుర్బరమైపోయాయి. ప్రపంచంలోని అనేక స్వచ్చంధ సంస్ధలు, మానవ హక్కుల సంఘాల ఒత్తిడి మేరకు ఖతార్ ప్రభుత్వం కఫాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.