కడప- విజయవాడ విమాన సర్వీసును డిసెంబర్ లో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  సంప్రదిపంపులు జరుపుతున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం కడప-హైదరాబాద్ విమాన సర్వీస్ అందుబాటులో ఉందని, కడప నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరులకు, విశాఖ నుంచి గజదల్ పూర్ కు విమాన సర్వీసులు డిసెంబర్ లో అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.  పర్యాటక రంగం విస్తరణకు అపార అవకాశాల మీద ఆయన  అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా కొత్త  విమాన సర్వీసులు ప్రారంభం కావడం గురించి చర్చించారు.

డిసెంబర్ నుంచి ఇండిగో కొత్తసర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరులకు డిసెంబర్ నుంచి సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. వచ్చే సమ్మర్ నుంచి విజయవాడ నుండి సింగపూర్ కు విమాన సర్వీసు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని అధికారులు వెల్లడించారు.  విమానాశ్రయాల్లో హస్త కళా ఉత్పత్తులతో పాటు చేనేత వస్త్రాలు అమ్మకానికి ఒక షోరూమ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించమని ఆయన అధికారులకు చెప్పారు. త్వరలో వెయ్యి క్యాబ్ లు అందుబాటులో ఉంచేవిధంగా ఓలా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, ఆ సంస్థవారు విశాఖలో తమ ప్రాంతీయ కేంద్రాన్ని కూడా ప్రారంభించినట్లు చెప్పారు.  ఇప్పటికే విశాఖలో అద్దెకు బైకులు ఇస్తున్నారు. అమరావతిలో మెగా శిల్పారామం, విశాఖ, తిరుపతి, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తిలలో ఆరు శిల్పారామాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అమరావతిలో సీఆర్డీఏ స్థలం కేటాయించవలసి ఉంది.