సంసారాలుండవు గాని, జైలు నుంచి అన్ని సాగించవచ్చు. లీడర్లకు నిరంతరం పార్టీని, ప్రభుత్వాన్ని చూసే దివ్వశక్తిని జైళ్లు ప్రసాదిస్తాయి
రాజకీయంగా చూస్తే జైలుకి పోయెస్ గార్డన్ వేదనిలయానికి పెద్ద తేడా లేదు. ఆ మాటకొస్తే బడా నేతల భారీ నివాసాలకి, అంతే భారీ ప్రహారీ గోడలున్న సెంట్రల్ జైళ్లకి తేడా లేదు. రెండింటిటి భారీ సెక్యూరిటీ ఉంటుంది. రెండుచోట్లా అయిన వాళ్లనే అనుమతిస్తారు. లోపల నుంచి ప్రపంచాన్ని చూసే అన్ని ఏర్పాట్లుంటాయి. సంసారాలుండవు గాని, జైలు నుంచి అన్ని సాగించవచ్చు. లీడర్లకు నిరంతరం పార్టీని, ప్రభుత్వాన్ని చూసే దివ్వశక్తిని జైళ్లు ప్రసాదిస్తాయి.
ఈ విషయం చాలాసార్లు, చాలా సందర్భాలలో, చాలా రాష్ట్రాలలో చాలా మంది విషయంలో రుజువయింది.
ఇపుడు కర్నాటక జైలులో కూర్చున్న ఎఐడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు, పోయెస్ గార్డెన్ నివాసానికి కూడా తేడా ఉండదు. చక్కగా కర్నాటక జైలు నుంచి ఆమె పరిపాలన సాగిస్తారు. మంత్రులతో మాట్లాడతారు. అ వసరమయితే ముఖ్యమయిన ఫైల్స్ కూడా వస్తాయి. ముఖ్యమంత్రి , మంత్రులు, శాసన సభ్యులు, పార్టీ సైనికులు రెగ్యులర్ గా జైలు సందర్శిస్తారు. ఆమెకు ప్రత్యేక హోదా కూడా వచ్చే అవకాశమూ ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని నియమేమీ లేదు. రాజకీయ హోదా లే కపోయినా , డబ్బున్న రామలింగరాజు కు హోదా ఇచ్చి గౌరవించలేదూ...
గతంలో జైలుకు వెళ్లిన ప్రముఖ నాయకులయిన లాలూ ప్రసాద్ యాదవ్, ఒం ప్రకాశ్ చౌతాలా, జయలలిత, జగన్మోహన్ రెడ్డి సెల్ నుంచి ఏమి చేశారో, శశికళ కూడా అదే చేస్తుంది. పాఠ్యపుస్తకాలలో ప్రజాస్వామ్యం గురించి చదువుకుని, వాటిని ఒల్లె వేసే వాళ్లు మాత్రమే, శశికళ పని ఫినిష్ అయిందనుకుంటారు.
జాతీయ రాజధాని న్యూఢిల్లీలోని తీహార్ జైలు నుంచి హైదరాబాద్ చంచల్ గూడ వరకు అన్ని జైల్ల గోడలకు కనిపించని కన్నాలుంటాయి. వాటిలోనుంచి మొబైల్ ఫోన్ లు, డ్రగ్స్,డబ్బు, మద్యం సరఫరా అవుతూనే ఉంటాయి.అవి మూసుకుపోని కన్నాలు. జైలేదయిన ఈ కన్నాలు వేసేది ఒకరే, అధికారులు. ఈ కన్నాల నుంచే శశికళ కూడా తమిళనాడు రాష్ట్రం మీద, పార్టీమీద , ప్రభుత్వం మీద నిఘాపెడుతుంది. ఈ నిఘా ఎలా ఉంటుందో చూడండి.
2013, జనవరి 16న హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలాకు, కొడుకు అజయ్ కు టీచర్ల రిక్రూట్ మెంట్ కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. అబ్బడు కొడుకు జైలుకెళ్తున్నారు కాబట్టి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పని అయిపోయిందనుకున్నారు. అప్పటికి ఆయన అయిదుసార్లు ముఖ్యమంత్రి అయి ఉన్నారు. జైలు కెళ్లే ముందు మరొక కొడుకు అభయ్ కి పార్టీని అప్పగించాడు. జైలు కెళ్లాక గోడలు, ఖైదీ నెంబర్ ఆయనకేం అడ్డం కాలేదు. భటిండా జైలు గోడల కన్నాలు, జైలు పక్కనే ఉన్న మేదాంత ఫైవ్ స్టార్ ఆసుప్రతి నుంచి చౌతాల చక్కగా రెండో కొడుకు అభయ్ ద్వారా పార్టీ నడిపారు. అంతెందుకు,జైలు బయట, ఆసుపత్రిలోపల ఆయన రోజూ పార్టీ సమావేశాలే నడిపారు. క్యాండిడేట్లతో ముఖాముఖి మాట్లాడి టికెట్లు కూడా పంపిణీ చేశారు.
ఇక లాలూ ప్రసాద్ కు చౌతాలాకు ఉన్నసామ్యం చూద్దాం. పశుగ్రాసం కేసులో శిక్షపడిన లాలూ ప్రసాద్ జైలు కెళ్లే ముందు భార్యకు రాజ్యభారం అప్పగించాడు. సెప్టెంబర్ ,2013లో శిక్ష పడేదాకా జూలై 1997- డిసెంబర్ 2001 మధ్య అరుసార్లు లాలూ ప్రసాద్ యాదవ్ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
అపుడు ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నది భార్య రబ్డీ దేవియే అయినా, జైలు గోడల కన్నాల నుంచి పరిపాలన సాగించింది లాలూయే. (లాలూ పెళ్లి కూడా విద్యార్థినాయకుడిగా జైలులోనే ఉన్నపుడే జరిగింది).జైలు నుంచి రిమోట్ క్యాబినెట్ మీటింగులు కూడా నడిపాడు. ఫైళ్లు చంకనపెట్టుకుని సీనియర్ అధికారులు వచ్చేవారు. బేయూర్ జైలుకు రోజూ రావడానికి అధికారులు సిగ్గుపడుతూ ఉన్నారని తెలిసి, పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ లోని ఒక వార్డును ఆయన కోసం జైలు గా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ జైలు నుంచి ఎలా వ్యవహారాలు నడిపారో అందరికీ బాగా తెలుసు. ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
2001లో, చెన్నై ప్లైవోవర్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారని డిఎంకె అధినేత కరుణానిధి, కుమారుడు స్టాలిన్ ను కూడా అరెస్టు చేసి జైలులో వేశారు. వారిద్దరు జైలులో ఉన్నా పార్టీ వ్యవహారాలు అక్కడి నుంచే నిర్వహించారు. ఇద్దరు జైలులో ఉంటే నష్టమని భయపడలేదు. సరిగదా, కరుణానిధి బెయిలే వద్దు అన్నారు.
సెప్టెంబర్ 2014 లో బెంగుళూరుకోర్టు జయలలితకు అక్రమ ఆస్తుల కేసులో శిక్ష విధించింది. ఇది కొత్త కాదు, గతంలో టాన్సి భూ సేకరణ కేసులో కూడా అమె జైలులో ఉన్నారు. చైతాలాకు అభయ్, లాలూకు రబ్డీ, జగన్ కు విజయమ్మ, షర్మిలా లాగా, కుటుంబ సభ్యులు లేరు కాబట్టి పన్నీర్ సెల్వాన్ని అమె వారసుడిగా ప్రకటించారు. అప్పటినుంచి ఆమె జైలు నుంచే పార్టీని, ప్రభుత్వాన్ని నడిపారు. అధికారులు చూసిచూడనట్లు పోయారు.
ఇపుడు శశికళకూడా జైలు కెళ్లిపోతూ కుటుంబ సభ్యుడు దినకరన్ ని పార్టీ డిప్యూటి జనరల్ సెక్రటరీ గా నియమించింది. ఇంకా కొందరు ఇతర బాధ్యతలను చేపట్టారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం పాత్ర పోషిస్తాడు. అంతసవ్యంగా జరిగేలా చూసేందుకు జైలు గోడలకు కన్నాలున్నాయి, అవసరమయితే గేట్లు తెరిచేందుకు అధికారులూ ఉన్నారు.
