వైసీపీ అధ్యక్షుడు జగన్ సీఎం కావాలని ఆయన అభిమానులు.. ఒక్కోరు ఒక్కో విధంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి వినూత్నంగా తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. వైసీపీ ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను ప్రతిబింబించేలా పోస్టర్లు తయారుచేసి వాటిని ట్రాక్టర్లపై  ప్రదర్శించాడు.

అసలు విషయం ఏమిటంటే.. గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలో గంగానమ్మ కొలుపులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొలుపుల్లో భాగంగా గ్రామానికి చెందిన విఘ్నేశ్వర బ్రిక్స్‌ యజమాని చెంచల రామిరెడ్డి 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు.

మొక్కుబడులు ఉన్న వారు కొలుపుల్లో బండ్లను కట్టి, గ్రామంలో ఊరేగిస్తారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రతిబింబించే తొమ్మిది ట్రాక్టర్లను రామిరెడ్డి కట్టించారు. వాటికి వైసీపీ జెండా రంగులను వేయించారు. మద్యపాన నియంత్రణ, జలయజ్ఞం, ఫీజు రీయింబస్మెంట్, ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్లు, అమ్మ ఒడి, పింఛన్ల పెంపు, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ రైతు భరోసా పథకాల పేరిట ఏర్పాటు చేసిన పోస్టర్లను అలంకరించిన తొమ్మిది ట్రాక్టర్లను గ్రామ పెద్దలతో కలిసి గ్రామంలో ఊరేగించారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నదే తామందరి ఆశగా రామిరెడ్డి చెప్పారు.